దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ఎన్నార్సి పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎనార్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకం అంటూ ఆయన కడప జిల్లా పర్యటనలో భాగంగా వ్యాఖ్యానించారు. దానికి ఎలాంటి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.
ఇప్పటికే ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా ఎన్‌ఆర్‌సీపై ప్రకటన చేశారని.. తనతో చర్చించాకే దీనిపై ఆయన మాట్లాడారని జగన్ వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ స్పష్టం చేసారు. ఈ విషయంలో ప్రతి ముస్లిం సోదరుడికి అండగా ఉంటామని ఈ సందర్భంగా సిఎం జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయని జగన్ ఇటీవల క్యాబ్ కి కూడా మద్దతు ఇచ్చారు. అలాంటి అమిత్ షా చేసిన ఎన్నార్సి ప్రకటనకు వ్యతిరేకంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలను చూసుకుని బిజెపి బలహీనపడుతుందని గ్రహించిన తర్వాతే జగన్ ఈ నిర్ణయం ప్రకటించారని అంటున్నారు. ఇప్పుడు దీనిపై బిజెపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.