దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కామెంట్ చేశారు. ఉభయసభలను ఉద్దేశించి ఆమె ఇవాళ పార్లమెంట్‌లో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె అన్నారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు. ఇదే అంశాన్ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా అన్నారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారని ధంకర్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విషయంలో బీజేపీ, విపక్షాల మధ్య చాన్నాళ్లుగా వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఎమర్జెన్సీ విధించడం వల్ల దేశంలో ఎటువంటి అనర్థాలు జరిగాయో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఇటీవల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు దేశంలో గత పదేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. భారత్‌ను అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ శరవేగంగా ఆత్మనిర్భర్ దిశగా వృద్ధి చెందుతోందన్నారు. పేపర్ లీకేజీ లాంటి విషయాల్లో దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.