రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల రెండు నెలల జీతాన్ని ఇస్తామని తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ల సూచనల మేరకు రెండు నెలల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని తమ వంతుగా సహాయం అందించామన్నాయి పార్టీ వర్గాలు.
ఇక రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నాళాలు పొంగిపొర్లడంతో రహదారులు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేకమంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. వీరిని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది.