తాము ఇల్లు కడితే సీఎం రేవంత్ రెడ్డి సున్నాలు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాచారంలోని సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచ్చలవిడిగా వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, జనవాసాల నుంచి వెలువడుతున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఎంతో ప్రాముఖ్యమైనవని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సుమారు రూ.4వేల కోట్లు ఖర్చు చేసి ఎస్టీపీ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశామని.. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తూ.. ఇల్లు తాము కడితే సీఎం రేవంత్ రెడ్డి సున్నాలు వేస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవని.. ఏ పథకం అమలు చేయాలన్నా కాంగ్రెస్ అంటున్నారని.. మరీ మూసీ పునరుజ్జీవానికి మాత్రం ప్రభుత్వం వద్ద పైసలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.