రాష్టంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని ఆ పార్టీని భూస్షాపితం చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగా పది మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు.. ఈ క్రమంలో స్వంత పార్టీలో వ్యతిరేకత వచ్చినా.. వెనక్కి తగ్గలేదు.. ప్రస్తుతం జంపింగ్ ల సమయం ముగిసింది.. కానీ స్వంత పార్టీలో వ్యతిరేకత ఆ పార్టీకి తలనొప్పులుగా మారింది.. అన్ని నియోజకవర్గాల్లో ఓ ఎత్తైతే.. సీఎం స్వంత ఇలాకాలో కూడా అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి..
కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి.. ఆయన అనుచరులను కాపాడుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. ఆయన గెలుపు కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవంతో వారంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఆయన సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆ పార్టీ కీలక నాయకుడు కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. గతంలోనూ ఇక్కడ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది..
కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి మంచి పట్టుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రేవంత్ ను ఇక్కడి ప్రజలు ఆదరించారు.. నాయకులు సమిష్టిగా పనిచేసి.. గత ఎన్నికల్లో రేవంత్ ను మంచి మెజార్టీతో గెలిపించారు.. ఈ నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, ఆయన అనుచరులు రేవంత్ గెలుపులో కీలకంగా వ్యవహరించారట.. సీఎం అయ్యాక వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారంతా ఇటీవల కారు పార్టీలో చేరారు.. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నర్మద కూడా బీఆర్ఎస్ లో చేరారు..
పార్టీలో ఉన్న వారిని కాపాడుకోలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం వారితో ఉపయోగంలేదని వాదిస్తోంది.. మరో అడుగు ముందుకేసి.. చోటామోటా నేతల్ని డబ్బులిచ్చి బీఆర్ఎస్ కొనుగోలు చేసిందంటూ ఆరోపిస్తోంది.. నేతల అసంతృప్తి, పలువురు పార్టీకి గుడ్ బై చెప్పడం వంటి వాటిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీకి నష్టం జరక్కుండా జాగ్రత్త పడాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యనేతలకు సూచించారట..