తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చ జరుగుతుండగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రైతు బంధు తో సాగు విస్తీర్ణం పెరిగిందని.. ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు కేటీఆర్. అలాగే రైతు బంధును కాపీ కొట్టి బీజేపీ పీఎం కిసాన్ ఇస్తుందన్నారు. అలాగే పశ్చిమబెంగాల్, ఒడిశా కూడా రైతు బంధు మాదిరిగానే పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్బంలోనే నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్టుగా నిరూపిస్తే.. తాను పదవీకి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేటీఆర్ కి సవాల్ విసిరారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్దం అన్నారు. రాష్ట్రమంతటా కేవలం 11 నుంచి 13 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇచ్చారని ఆరోపించారు. రోడ్ల అమ్మకంతో వచ్చిన డబ్బులను రైతుబంధుకు మళ్లించారని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.