అమరావతిలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయితే ఏపీకి ఒకటే రాజధాని ఉండాలనీ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ అధినేత ఛలో అసెంబ్లీ పిలుపుతో రైతులు, తెలుగుదేశం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. మూడు రాజధానుల నిర్ణయంపై అసెంబ్లీ సమావేశాల్ని అడ్డుకునేందుకు అమరావతి జేఏసీ, టీడీపీ ప్రయత్నిస్తుంది.
దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పొలాల దారిన అసెంబ్లీ ముట్టడికి బయల్దేరారు. రోడ్డుపై వెళ్తే పోలీసులు అడ్డుకోవడంతో పొలాల దారిన ఆయన అసెంబ్లీకి బయల్దేరారు. మరోవైపు తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధాని వికేంద్రీకరణపై మంత్రివర్గ నిర్ణయం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తుళ్లూరు నుంచి భారీ ఎత్తున ప్రజలు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. అసెంబ్లీ వైపునకు వెళ్లేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని నెట్టుకుంటూ వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది మాత్రం పోలీసులను దాటుకుంటూ అసెంబ్లీవైపు పరుగులు తీశారు.