ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ట్వీట్ చేశారు. “రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోంది. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ రైతు కన్నీళ్లు పెడుతుంటే.. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్ళలో కారం కొడుతుంది.
మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతుంది. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస ధర రూ.26 వేలుగా ప్రకటించాలి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలి. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.
మిర్చి రైతు విలవిలలాడుతుంటే టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి రాక, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్ లో కేజీ టమాట రూ.15 పలుకుతుంటే రైతుకు కిలో మూడు, నాలుగు రూపాయలు కూడా దక్కడం లేదు. ఎకరాకు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన చోట 50 వేల మందం కూడా ఆదాయం లేదంటే టమాటా రైతుకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం అవుతుంది. వెంటనే టమాటా రైతును ఆదుకోవాలని, టమాటా ధరలు పడిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది” అంటూ ట్వీట్ చేసింది షర్మిల.