ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి తిరిగి వస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఆయన రెండు సార్లు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఉన్నపళంగా జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు.
ఆయన ఢిల్లీ వెళ్ళడానికి ప్రధాన కారణాలు అంటూ సోషల్ మీడియాతో పాటు, ప్రధాన మీడియాలో కూడా ఎన్నో వస్తున్నాయి. జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇవ్వాల్సిన నిధులతో పాటుగా, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్ లు, ఆర్ధిక లోటుతో పాటుగా, పోలవరం నిధులు, విభజన హామీలు అన్నీ మోడీ, అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిణామాలను కూడా వారితో చర్చించారు.
జగన్ ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆందోళన నెలకొంది. తమకు సంబంధించిన ఆస్తుల వివరాలను జగన్ కేంద్ర హోం శాఖకు ఇచ్చారని టీడీపీ నేతలకు సమాచారం అందింది. దీనితో అసలు ఎం చర్చించారు…? శుక్రవారం సాయంత్రం వరకు జగన్ వేచి చూసి రాత్రి సమయంలో అమిత్ షాని కలవడ౦ వెనుక కారణం ఏంటీ అనేది టీడీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్న.
ఇక శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆయన అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళారు. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో బిజెపి చెప్పింది. ఈ విషయాన్ని కూడా ఆయన షా తో చర్చించారు. ఇక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏపీ దిశా చట్టాన్ని కూడా ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. మరి వీటిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఐటి దాడుల తర్వాత జరిగిన పర్యటన కాబట్టి టీడీపీ నేతల్లో భయం నెలకొంది.