అసలు కేసినేని నానీ ఆలోచన ఏంటీ…? రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేసినేని నానీ ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు…? విజయవాడ రాజకీయాలకే కాదు, చంద్రబాబుకి కూడా ఆయన ఎందుకు తలనొప్పిగా మారారు…? పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టిన ఆయన ఇప్పుడు పార్టీనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు…? ఈ ప్రశ్నలు పార్టీ కార్యకర్తలను ఎంతగానో వేధిస్తున్నాయి.
ఫలితాలు వచ్చిన రోజుల వ్యవధిలో ఆయన పార్టీ ఆఫీస్ విషయంలో చేసిన వివాదం అంతా ఇంతా కాదు. దేవినేని ఉమాను ఆయన ఇబ్బంది పెట్టారు. మంత్రి కొడాలి నానీకి పదవి రావడం వెనుక ఉమా సహకారం ఉందని, రుణపడి ఉండాలని వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేసారు. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన ఎన్నార్సీ విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహ౦ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్ధం కాక పార్టీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీ విషయంలో టీడీపీ బిజెపికి మద్దతు ఇచ్చింది. కాని కేసినేని నానీ మాత్రం ఎన్నార్సీని వ్యతిరేకించే విషయంలో టీడీపీ మద్దతు ఇస్తుందని…
అలా జరగకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి రాజీనామా చేస్తాను అనడం ఇప్పుడు చంద్రబాబుకి కూడా ఇబ్బంది గా మారింది. బిజెపి తో స్నేహం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఎంపీ గా ఉన్న కేసినేని మజ్లీస్ తో స్నేహం చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.