కరోనాపై జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

-

చైనాలో పుట్టి 150 దేశాలకు విస్తరించిన కరోనా (కొవిడ్-19) రక్కసిపై ప్రపంచ దేశాలు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నాయి. ఏ దేశంలో చూసినా శరవేగంగా ప్రబలుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 8 వేల మందికిపైగా బలితీసుకున్న కరోనా వైరస్‌ నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఎంతోమంది నిపుణులు, శాస్త్రవేత్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు.

ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువుగా మారిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు భారత్ కూడా సిద్ధమైంది. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్త చర్యలు చేపట్టింది. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్ని శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు.

ప్రధానితో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ, హోంశాఖ, విదేశాంగ శాఖ తదితర అధికారులతోపాటు, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కరోనాను అరికట్టడానికి ఇప్పటికే చేపట్టిన చర్యలు, ఇకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ తర్వాత దశకు చేరకుండా అధికారులు, నిపుణులు అప్పమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యల తీసుకోవాలని ప్రధాని సూచించారు.

అదేవిధంగా, కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ధైర్యంగా ముందు నిలిచి పోరాడుతున్న వైద్య నిపుణులు, పారామెడికల్ సిబ్బంది, సైనికులు, పారామిలిటరీ బలగాలు, వైమానిక బలగాలు, మున్సిపల్ శాఖల సిబ్బందిని ప్రధాని మోదీ కొనియాడారు. ఉన్నతస్థాయి సమీక్ష ద్వారా కరోనాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్న ప్రధాని.. ఈ రోజు (మార్చి 19) రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రాణాంతక కరోనాపై ప్రధాని ఎలాంటి ప్రకటన చేయబోతున్నారోనని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news