కరోనా వైరస్ చైనా వల్లే వ్యాప్తి చెందిందనీ.. అది చైనా వైరస్ అనీ.. చైనాలోని వూహాన్‌లో సైంటిస్టులు చేసిన ప్రయోగాల వల్లే కరోనా వైరస్ ఆ ల్యాబ్ నుంచి బయట పడి జనాలకు వ్యాప్తి చెందిందని.. అందువల్ల చైనా తాను చేసిన పనికి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు కదా.. ఇక చైనా కూడా అమెరికాపై ఎదురు దాడి చేస్తోంది. అమెరికా సైనికుల వల్లే ఆ వైరస్ వ్యాప్తి చెందిందని చైనా ఆరోపిస్తోంది. అయితే నిజానికి ఒక అమెరికానో.. ఒక చైనానో.. ఈ వైరస్‌కు కారణం కాదు.. ఆ రెండు దేశాలకూ ఇందులో భాగం ఉందని తాజాగా తెలిసింది.
చైనాలోని వూహాన్‌లో ఉన్న వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌తోపాటు.. అక్కడికి 1000 మైళ్ల దూరంలో ఉన్న యున్నన్ అనే ప్రాంతంలోని వూహాన్‌కు చెందిన మరో ల్యాబ్‌లోనూ పలు రకాల క్షీరదాలపై ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వం 3.70 మిలియన్ డాలర్లను రీసెర్చర్లకు అందజేసిందట. ఆ నిధులతోనే సైంటిస్టులు ప్రయోగాలు చేశారట. ఈ క్రమంలోనే వారు గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే కరోనా వైరస్ లాంటి వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో అనుకోకుండా వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్న రక్తం సైంటిస్టుల మీద పడిందట. ఇక రీసెర్చిలో భాగంగా సైంటిస్టులు 3 రోజుల వయస్సున్న పంది పిల్లలకు ఓ వైరస్‌ను ఎక్కించారట. అనంతరం అవి అనారోగ్యానికి గురయ్యాక వాటిని ఇంకొన్ని పంది పిల్లలకు తినిపించారట. ఈ క్రమంలోనే ఆ వైరస్ ఆ ల్యాబ్ నుంచి అలా బయటికి వచ్చి ఉండవచ్చని ది డెయిలీ మెయిల్ అనే యూకే పత్రిక తనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలను వెల్లడించింది.
ఇక కరోనా సోకిన మొదటి 41 మంది పేషెంట్లలో 13 మంది వూహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌కు వెళ్లలేదని.. అక్కడి హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు ఒకరు తెలిపారు. అంటే.. వారికి ఇతర మార్గాల ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని.. ఈ క్రమంలో ల్యాబ్ నుంచి బయటకు లీకైన వైరసే వారికి వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక వూహాన్ ల్యాబ్‌కు హువానన్ సీఫుడ్ మార్కెట్ చాలా దగ్గర్లో ఉంటుంది. అందువల్ల ల్యాబ్ నుంచి లీకైన వైరస్ ఆ మార్కెట్ ద్వారా మాంసం నుంచి జనాలకు వ్యాప్తి చెంది ఉంటుందని కూడా భావిస్తున్నారు.
అయితే ఇన్ని రోజులూ.. అమెరికా, చైనాలు.. నువ్వు దొంగంటే.. నువ్వు దొంగ.. అని ఒకరినొకరు తిట్టుకుంటూ వచ్చాయి. కానీ తాజాగా తెలిసిన ఈ వివరాలతో ఈ రెండు దేశాలకూ కరోనా వైరస్‌తో సంబంధం ఉండి ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఎంతకాలం అబద్దాలు చెప్పినా.. నిజం ఎన్నటికీ దాగదు కదా.. అది బయటపడితే మాత్రం.. దోషికి కచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు.. లేదా రెండు దేశాలూ కావచ్చు.. తప్పు చేస్తే శిక్ష అనుభవించే రోజు తప్పకుండా వస్తుంది.. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే..!