కరోనా వైరస్ ఏమో గాని ప్రతీ గల్లీకి ఒక శాస్త్రవేత్త తయారు అవుతున్నారు. సోషల్ మీడియా ఉండటం, మీడియా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తమలో ఉన్న ప్రతిభను బయటపెడుతున్నారు జనాలు. ఇప్పటి వరకు అల్లం, తులసి కరోనాను చంపేసాయి. ఆవు మూత్రం కూడా ఈ జాబితాలోనే ఉంది. ఇప్పుడు ఒక నిమిషం గాలి పీల్చకపోతే కరోనా రాదని చెప్పారు యోగా గురు బాబా రామ్ దేవ్.
తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక నిమిషం పాటు ఊపిరి పీల్చుకోవడం ఆపగలిగిన వారికి కరోనా వైరస్ గానీ, దాని లక్షణం గానీ లేనట్లేనని ఆయన చెప్పారు. రోగలక్షణాలు ఉన్నా లేకున్నా సరే దీని ద్వారా కరోనా నిర్థారణ చేయవచ్చని ఆయన చెప్పడం గమనార్హం. కరోనా వైరస్ విరుగుడుకు ఓ ప్రత్యేకమైన ప్రాణాయామ ప్రక్రియ ఉందన్నారు ఆయన. దానిని ‘ఉజ్జై’ అని పిలుస్తామని చెప్పారు.
ముక్కు ద్వారా లోతుగా గాలి పీల్చుకున్నాక కాసేపు ఊపిరి బిగపట్టాలని సూచించారు బాబా రామ్ దేవ్. ఆ తరువాత నిదానంగా వదలాలని సూచించారు. దీన్ని ఉజ్జయ్ ప్రాణాయామం అంటారన్నారు ఆయన. ఇది కరోనా పని పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం. దీర్ఘకాలిక రక్తపోటు, గుండె సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు, వృద్ధులు 30 సెన్ల పాటు శ్వాసను ఆపగలుగుతారని ఆయన వివరించారు.
యవ్వనంలో ఉన్నవారు ఒక నిమిషం పాటు ఆపగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే కోవిడ్ -19 లక్షణంతో పాటు రోగ లక్షణం కూడా లేనట్లేనని అన్నారు ఆయన. అయితే ఈ ఉజ్జై ప్రాణాయామానికి ముందే ముక్కులోకి ఆవ నూనె పోసుకుంటే, వైరస్ అంతా కడుపులోకి వెళ్లి అక్కడున్న యాసిడ్లో పడి నాశనమైపోతుందని ఆయన చెప్పడం గమనార్హం.