జాతీయ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారనే వాదన బలం గా వినిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీని బీజేపీ నేతలు పనిగట్టుకుని ప్రస్తుతి స్తున్నారని అంటున్నాయి జాతీయ మీడియా కథనాలు. వారు వీరు అనే తేడాలేకుండా అధికారుల నుంచి బీజేపీ పార్టీ నాయకులు , కేంద్ర మంత్రులు కూడా ప్రధానిని హైలెట్ చేస్తున్నారు. నిజానికి గతంలో ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు కేంద్రం ఇంతకంటే.. ఎక్కువగానే స్పందించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అప్పట్లో ప్రదానిని ఇలా ప్రస్తుతించిన సందర్భాలు లేవని జాతీయ మీడియా అంటోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతోంది. అదేసమయంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అదేసమయంలోమరణాలు కూడా పదివేలకు చేరువలో వడివడిగా పరుగులు పెడుతున్నాయి. దీనికి సంబంధించి నిన్న మొన్నటి వరకు కూడా కేంద్రం అనుస రించిన వైఖరి కారణంగానే ఇలా కేసులు పెరిగాయని జాతీయ మీడియా ఘోషించింది. డిసెంబరు చివరి వారం, జనవరి రెండు వారాల్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ సహా ఇంటిలిజెన్స్ కూడా మోడీని హెచ్చరించిందని, అయినా కూడా ఆయన కరోనాను లైట్‌గా తీసుకున్నారని దీంతో లాక్డౌన్ విధింపు విషయానికి వస్తే.. మార్చి చివరి వారం వరకు కూడా దోబూచులాడారని అన్నారు.
ఇక, డిసెంబరు, జనవరి మధ్యకాలంలోనే దేశంలో లాక్డౌన్ కన్నా ముందే అంతర్జాతీయంగా విమానాలు నిలిపి ఉంటే.. కరోనా ఎఫెక్ట్ దేశంలో అస్సలు ఉండేది కాదన్నది మీడియా ఉద్దేశం అంటే ఈ విషయంలో మోడీ ఫెయిలయ్యారన్నమాట! అదేసమయంలో దేశంలో లాక్డౌన్ విధించిన తర్వాత కూడా వలస కూలీల విషయంలో కేంద్రం పెద్దగా స్పందించలేదు. ఇక, రాష్ట్రాల కు నిధులు ఇవ్వడంలోనూ కోత పెట్టింది. ఇక, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో రాష్ట్రాలకే బాధ్యత అప్పగించి కేంద్రం తప్పుకొందన్నది నిజం. కానీ, ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ, కేంద్రమంత్రులు కానీ ఈ తప్పులు కప్పిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలుకుని కేంద్రం మంత్రుల వరకు అందరూ ఇప్పుడు నరేంద్ర మోడీని హీరో ను చేయడంలో పోటీ పడుతున్నారు. మోడీ చర్యల కారణంగా నే లక్ష కేసులు నమోదు కావాల్సిన దేశంలో వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. కానీ, అసలు కేంద్రం తన చర్యలను డిసెంబరులోనే చేపట్టి ఉంటే.. ఈ కేసులు అస్సలు నమోదు కూడా అయ్యేవి కాదనే వైద్యుల విశ్లేషణలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అదేసమయంలో రాష్ట్రాలకు మరింతగా నిధులు ఇవ్వాలన్న ఆర్ధిక నిపుణుల సూచనలను కూడా మోడీ పట్టించుకోలేదన్న విమర్శలను కూడా వీరు పట్టించుకోకుండా పది పొగడ్తలు, పదహారు ప్రశంసలతో పొద్దుపుచ్చుతున్నారని అంటున్నారు.