పొరపాటున కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియకపోతేనే బెటరేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే… తీరా ఆ విషయం గురించి తెలుసుకున్నాక బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి మరి! ఆ రేంజ్ లో రక్తం మరిగిపోతుంది.. కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంతకూ విషయం ఏమిటంటారా… దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు పంగనామాలు పెట్టి పరార్ అయిన బ్యాచ్ గురించి చాలా మందికి తెలిసిందే! వీరిలో కొంతమంది విదేశాలకు పరార్ అవుతుంటే… మరికొందరు నమో అంటూ భారతీయ జనతా పార్టీలోకి చేరి పెద్దమనుషులుగా చలామని అవుతూ.. ఈ వ్యవహారం నుంచి తప్పించుకుంటున్నారు! ఆ సంగతులు అలా ఉంటే… ఇలాంటి డీఫాల్టర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊహించని వరాలను ఇచ్చింది. ఈ విషయంపై వివరాలను బయటపెట్టాలని లోక్ సభలో రాహుల్ గాంధీ కోరగా… నిర్మలా సీతారామన్ నిరాకరించారు! ఆ నిరాకరణ ఎందుకో ఇప్పుడు స్పష్టంగా అర్ధమవుతుంది చదవండి!
దేశంలోని బ్యాంక్ డీఫాల్టర్లలో ప్రముఖులు అయిన 50 మందికి గత కొంతకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వరాన్నే ఇచ్చిందని చెప్పాలి. వారికి సంబంధించిన సుమారు రూ. 68,600 కోట్ల రుణాలను రద్దు చేసింది. సమాచార హక్కు చట్టం ప్రకారం.. ఒక కార్యకర్త సంపాదించిన సమాచారం ప్రకారం.. కొన్ని షాకింగ్ నిజాలు దీని ద్వారా బయటపడుతూ ఉన్నాయి. అప్పుడే షాక్ అయిపోకండి… ఇంతకీ ఈ రుణమాఫీతో లాభపడిన వారెవరో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి!
ఈ రూ. 68,000 కోట్ల రుణమాఫీలో లబ్ధి దారులు ఎవరయ్యా అంటే… పరారీలో ఉన్న గీతాంజలి జెమ్స్ అధినేత చోక్సీ, ఈడీ స్కానర్ లో ఉన్న సందీప్ ఝన్ ఝన్ వాలా, పరారీలో ఉన్న చోస్కీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విజయ్ మాల్యా, బాబా రాందేవ్ అండ్ బాలకృష్ణ గ్రూప్… ఇలా మొదలైన బడా వ్యాపారులు! ఇప్పుడు ఒక్కొక్కరి సంగతి చూద్దాం. చోస్కీ గ్రూపులకు సంబంధించే దాదాపు 7 వేల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేశారంట. ఇదే క్రమంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా ఈ రుణమాఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిషరీ అంట! ఒకవైపు తను తీసుకున్న అప్పులను వడ్డీలు కట్టకుండా.. అసలు మాత్రం చెల్లిస్తానని విజయమాల్యా చెబుతుంటే.. బ్యాంకులు ఒప్పుకోవడం లేదని వార్తలు వస్తుంటే… ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో ఇలా అసలు + వడ్డీ ఏమీ కట్టొద్దంటూ రుణమాఫీ చేసేసిందంట!
అప్పుడే అయిపోయిందనుకునేరు… గత ఐదారేళ్లలో రాందేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యం అతిభారీగా విస్తరించిందని, విదేశాల్లో కూడా మనోడి బిజినెస్ దుమ్ము దులిపేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో… బాబా రాందేవ్ అండ్ బాలకృష్ణ గ్రూప్ కూడా ఈ రుణమాఫీలో భారీగా లబ్ధి పొందిందట. ఇలా లాభాల్లో ఉన్నా ఈ కాషాయధారి కంపెనీకి సంబంధించి 2,212 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేశారట. ఈ మాఫీ అంతా “వీరభక్త నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో” జరిగినదే కావడం గమనార్హం! దేశంలో రైతు రుణాలను మాఫీ చేయమని అడిగితే.. రైతులను బాగు చేయడానికి రుణమాఫీ పరిష్కారం కాదని మోడీ తరుపు మేధావులు చెబుతుంటారు కానీ.. ఇలా డీఫాల్టర్లకు మాత్రం మాఫీ చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోమంటారో… వారికే తెలియాలి!
ఇక్కడ మోడీ ప్రభుత్వం ఆడిన మరో నాటకం ఏమిటంటే… విల్ ఫుల్ డీఫాల్టర్లు అయిన 50 మందికి చేసిన రుణమాఫీ వివరాలను, వారి పేర్లను బయట పెట్టాలని రాహుల్ గాంధీ లోక్ సభలో కోరగా, అందుకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు! ఎందుకో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటాది! కానీ… సభలో చెప్పకపోయినా ఆ వివరాలను తెలపాలంటూ తాను ఆర్టీఐ ని ఆశ్రయించినట్టుగా.. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చిన ఆర్టీఐ కార్యకర్త చెప్పారు. ఇది మోడీ మార్కు మనకు కనిపించని దేశభక్తి!… “నమో” ఢీఫాల్టర్ల రుణమాఫీ!!
కాగా 68,600 కోట్ల రూపాయలు అంటే.. దేశంలో చాలా రాష్ట్రాల వార్షిక బడ్జట్ కన్నా చాలా చాలా ఎక్కువ!