వరి ధాన్యం నిల్వలో ఈ తప్పులు చేయకండి…!

-

వ్యవసాయం అంటే.. కత్తిమీద సాము లాంటిందే.. ఎప్పుడు ఏ విపత్తు వచ్చి పంటను నాశనం చేస్తుందో చెప్పలేం. విత్తనం వేసినప్పటి నుంచి.. పంట చేతికొచ్చే వరకూ ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటిని ఎదుర్కోని మొత్తానికి పంటకోస్తే.. ఇప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడం కూడా పెద్ద టాస్కే.. ఇదే చాలా ముఖ్యమైన ఆఖరి దశ. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కష్టం ఆ‌విరైపోవాల్సిందే. ఆర్థికంగా కుంగిపోక తప్పదు. వరిపంటను నిల్వచేసే విషయంలో రైతులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఈరోజు మనం చూద్దాం..!
వరి కోతల అనంతరం ధాన్యాన్ని బాగా ఎండబెట్టు కోవాలి. వాటిని నిల్వచేసేందుకు సిమెంట్ కాంక్రీటు గోదాములను సిద్ధం చేసుకోవాటం మంచిది. సిమెంట్ గోదాములలో నిల్వ ఉంచుకుంటే పురుగుల బారి నుండి రక్షించవచ్చు.
క్రిమి కీటకాలు, వాటి గుడ్లు పొలం నుండి గింజల ద్వారా నిల్వ చేసే గోదాంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ధాన్యాన్ని బాగా శుభ్రపరిచి దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, తాలు గింజలు లేకుండా చేసుకోవాలి. ధాన్యాం నూర్పిడి చేసే ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
ఎడ్లబండ్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, వాటి టైర్లు మొదలగునవి శుభ్రముగా ఉంచాలి. ధాన్యం నిలువకు కొత్త గోనె సంచులను, పాతవైతే ఎలాంటి పురుగులు లేని వాటిని వాడాలి. ఎండబెట్టే ముందు గోనె సంచుల పై మందు చల్లి అందులో నిల్వచేయాలి.
నిల్వ చేసే గోదాములలో తేమ, వర్షపు నీరు ప్రవేశించకుండా గోదాముల నేలపై, పై కప్పులలో పగుళ్లు, రంధ్రాలు లేకుండా సిమెంటుతో పూడ్చాలి.
దుమ్ము, ధూళి లాంటి చెత్త ఏదైనా ఉంటే ధాన్యపు కోట్ల నుంచి తొలగించి నాశనం చేయాలి.
ఆహారధాన్యాలు నిల్వ చేయడానికి తగిన నిర్మాణాలను ఎంపిక చేసుకోవాలి. లోనికి తేమ, ఎలుకలు, పక్షులు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుకల బొరియలకు గాజు ముక్కలు, రాళ్లు, మట్టి, సిమెంటుతో కన్నాలను పూడ్చాలి.
గిడ్డంగులలో పక్షులు రాకుండా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లకు ఇనుప జాలీలు, బిగించి కట్టుదిట్టం చేయాలి. లోహపు రేకులు తలుపు కింద సందు లేకుండా అరడుగు వరకు బిగించాలి. ఇలా చేయడం వలన ఎలుకలు లోనికి ప్రవేశించలేవు. ఎలుకలు..ధాన్యాన్ని తినడమే కాకుండా రెట్టలను , వెంట్రుకలు, మిగతా వ్యర్థాలను చేర్చి పాడు చేస్తాయి.
తడి తగలకుండా ఉండేందుకు బస్తాల కింద చెక్క దిమ్మెలను ఉంచాలి. బస్తాలకు తేమ తగలకుండా వెదురు తడికలను వాడాలి.
నిల్వ ధాన్యాలకు కీటకాలు , ఎలుకలు ఆశిస్తే రసాయన మందులు వాడి నివారణ చేపట్టాలి.
గోదాములలో ఆహార ధాన్యాలకు పురుగు పట్టకుండా 4 వారాలకొకసారి 50 శాతం మలాథియాన్ పిచికారీ చేయాలి. లీటరు నీటికి 10 మి. లీ. వంతున 3 లీటర్ల మలాథియాన్ మందు ద్రావణాన్ని 100 చ.మీ. విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. తక్కువ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు వేపాకు, వేపగింజల పొడి , వెల్లుల్లి గుజ్జు, సీతాఫలం గింజల పొడి ధాన్యంలో కలిపితే కీటకాల బెడద ఉండదు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వరిధాన్యాన్ని పాడవకుండా నిల్వచేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news