వేసవి పశుపోషణలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

-

వేసవిలో మనుషులో తట్టుకోలేరు.. ఇక నోరు లేని మూగజీవుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అధిక వేడి.. పాడి పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ‌వుల కంటే.. గేదలు ఎండకు బాగా దెబ్బతింటాయి. ఇవి నల్లగా ఉండటంతో.. వేడి బాగా తగులుతుంది.
యజమానులు పశుపోషణ విషయంలో ఎండాకాలంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
పశువులకు వడ దెబ్బ తగలకుండా వీలైనంత వరకు రక్షణ చర్యలు తీసుకోవాలి. 27 డిగ్రీ ఉష్ణోగ్రత వరకు మాత్రమే పశువులు తట్టుకుంటాయి. అంతకు మించి అయితే.. నోట్లో లాలా జలం కూడా తగ్గిపోతుంది. నెమరు వేయడానికి వీలుకాదు. దాహం ఎక్కువగా ఉండి ఎక్కువ నీళ్లు తాగుతాయి. ఫలితంగా మేత సరిగ్గా తినవు. శరీరంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ స్థాయులు పడిపోతాయి. పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
వడ దెబ్బకు గురైన పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వడ దెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు వాటిని నీటిలో తడపాలి. చల్లని నీటిలో తడిపిన బట్ట, గోనె సంచిని కప్పాలి. సెలైన్ ఎక్కించడం లేదా సోడియం క్లోరైడ్ అందించడం చేయాలి.
వేసవిలో పశువలకు రోగనిరోధక శక్తి తగ్గుతుంది.. కాబట్టి ముందుగానే.. గాలి కుంటు వ్యాధి, గొంతు వాపు, జబ్బ వాపు వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. పశువులు మురుగు నీళ్లు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. మురికి నీటి వల్ల జీర్ణ కోశ వ్యాధులు వస్తాయి . ఎప్పటికప్పుడు వాటిని పరిశుభ్రంగా, చల్లగా ఉంచుకోవాలి.
ఎండ తీవ్రత నుంచి తగ్గించేందుకు మంచి గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. షెడ్ ల చుట్టూ చెట్లు ఉండాలే చూసుకోవాలి. పశువులను రోజుకి రెండు మూడు సార్లు కడగాలి. అవి తాగేందుకు ఎక్కువ నీటిని అందుబాటులో ఉంచాలి. తేలిగ్గా అరిగే..జావ, గంజి వంటివి ఇవ్వాలి. పచ్చి గడ్డి ఎక్కువగా ఇవ్వాలి. లేదంటే మాగుడు గడ్డి ఇవ్వాలి. మేత కూడా ఉదయం సాయంత్రం ఇవ్వాలి. పచ్చి గడ్డిని పగలు, ఎండు గడ్డిని రాత్రి వేళల్లో అందించాలి. ఎండ వేళల్లో వాటికి విశ్రాంతి ఇవ్వాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news