కొబ్బరి సాగులో మెళుకువలు..సేంద్రీయ ఎరువులు ఇలా తయారుచేయండి.!

-

కొబ్బరి చెట్లు అనగానే మనకు ఆంధ్రాలో అయితే కోనసీమ గుర్తుకువస్తుంది..ఇక ఎక్కువగా ఉండే రాష్ట్రం చెప్పమంటే..కేరళనే చెప్తాం. ఇక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు కూడా కొబ్బరిసాగులో ముందు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. శాస్త్రీయమైన ఆధునిక సేధ్యపు పద్దతులు పాటించటం ద్వారా రైతులు కొబ్బరిలో మంచి దిగుబడి సాధించుకోవచ్చు.. ముఖ్యంగా కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. కొబ్బరిలో ఎరువులను అందించే విషయంలో రైతులు సరైన పద్దతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పద్దతులు ఏంటో చూద్దామా?

కొబ్బరి మొక్కల ఎంపిక మరియు నాటు పద్ధతి

కొబ్బరిలో మంచి దిగుబడిని నిలకడగా పొందాలంటే నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకొని, నాటుకోవాలి. నారుమడిలో ముందుగా మొలక వచ్చి, ఎక్కువ ఆకులు గలిగి, మొదలు లావుగా ఉండి (10 సెం.మీ.) ఆకులు త్వరగా నిడివడే లక్షణాలు గల మొక్కలు నాణ్యమైనవిగా అనుకోవచ్చు. ఈ లక్షణాలు గల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.

మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఏవిధమైన చీడపీడలు లేకుండా ఉండాలి. 1-1/2 సం. వయస్సు గలిగిన మొక్కలను మాత్రం తోటలో నాటడం మంచి పద్ధతి. సాధారణంగా వర్షాకాలం వచ్చే ముందే అంటే ఏప్రియల్ మే మాసాలలో గోతులను తీసి ఉంచుకోవాలి. మొక్కకు, వరుసకు మధ్య (ఎటువైపునయినా) 8 మీటర్ల దూరం ఉండేలా గోతులను తీసి ఉంచుకోవాలి.

ఎకరానికి 60 మొక్కలు చొప్పున నాటుకోవచ్చును. 1x1x1 మీ. పరిమాణం” గల గోతులను తీసికొని, ఎండాకాలంలో బాగా ఆరనివ్వాలి. జూన్ జూలై మాసాలలో తొలకరించాక, గోతిని మంచి మట్టితో / బండ్రు మట్టి మరియు బాగా చివికిన పశువుల ఎరువు (25 కిలోలు) + 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్తో నింపుకోవాలి. ఎంపిక చేసిన కొబ్బరి మొక్కను గోతి మధ్యలో ఉంచి, మట్టితో నింపి, మట్టిని గట్టిగా తొక్కి, వెంటనే పలచగా నీరు పెట్టుకోవాలి.

కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం ;

నత్రజని : కొబ్బరిలో లేత మొక్కల ఎదుగుదలకు, త్వరగా పొత్తు రావడానికి నత్రజని పాత్ర చాలా ముఖ్యం. కాపు వచ్చిన చెట్లలో నత్రజని, పాటాష్‌తో కలిపి నరైన పాళ్లలో వేస్తే దాదాపు 28 శాతం కాయ దిగుబడి పెరిగిందని పరిశోధనల్లో స్పష్టంగా తేలింది.

పొటాషియం: కొబ్బరి తోటలలో అతి ముఖ్యమైన స్థూలపొషక పదార్ధం పొటాషియం. దీనివల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి. పొత్తుల సంఖ్య పెరిగి, బంతులలో ఫలదీకరణ సవ్యంగా జరిగి, కాపు నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాయలలో కొబ్బరి, నూనె దిగుబడి బాగా పెరుగుతుంది. పొటాష్‌ కారణంగా మొక్కలు చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి.

భాస్వరం : లేత కొబ్బరి మొక్కలలో మొదలు లావుగా ధృడంగా తయారవడానికి, ఎక్కువ ఆకులు ఏర్పడటానికి ఈ భాస్వరం ఉపయోగపడుతుంది. అందువలన మొక్కలు పాలంలో నాటేటపుడు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు భాస్వరం 250 గ్రాములు మట్టితో కలిపి, సూద మొక్కను నాటి నట్టయితే మొక్కలు ధృడంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాపుకు వచ్చిన చెట్లకు భాస్వరాన్ని, నత్రజని, పొటాష్‌ ఎరువులతో కలివి వేసినవుడు వేరు బాగా తొడిగి భూమిలో ఉండే నత్రజనిని పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

కొబ్బరి తోటలలో వాడవలసిన ఎరువుల వివరాలు :

నాటిన 1 సంవత్సరము. నుండి, సిఫార్పు చేసిన మొతాదులలో ఎరువులు వాడాలి. వేపపిండి, పశువుల ఎరువు, వర్మికంపోస్ట్‌ వంటి సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకం చాలా లాభదాయకంగా ఉంటుంది. దిగుబడులు నిలకడగా ఉంటాయి.

1.4 సంవత్సరముల వయన్సు చెట్లకు 1/2 కిలో యూరియా , 1 కిలో సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ , 1 కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ , 20 కిలోల పశువుల ఎరువు చొప్పున చెట్టుకు అందించాలి.

5 సంవత్సరములు వయస్సు మించిన కాపు కాసే చెట్లకు 1 కిలో యూరియా , 2 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ , రెండున్న కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండి అందించాలి.

సేంద్రీయ ఎరువుల వలన ఉపయోగాలు :

1. ముఖ్యంగా తేలక నేలల్లో తేమను ఎక్కువ కాలము ఉండేట్లు చేస్తుంది.

2. భూమిలో ముఖ్యపదార్ధమైన సేంద్రీయ కర్బనమును ఎక్కువ చేస్తుంది..

3. భూమిలో సూక్ష్మజీవుల సంతతి పెంచి, తద్వారా మట్టిలో మొక్కల వేర్లను పోషకాల లభ్యత పెంచుతుంది.

4. భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణములను చౌడును తగ్గిస్తుంది.

5. భూమి యొక్క భౌతిక లక్షణములను అభివృద్ధి చేస్తుంది.

సేంద్రీయపు ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరము వాడుట వలన భూమిలో లభ్యమయ్యే.. పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు ఏపుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

కొబ్బరి తోటలలో ఉపయోగపడు సేంద్రీయ ఎరువులు :

1. వర్మికంపోస్ట్ : కొబ్బరి తోటలలో వ్యర్థపదార్ధాలైన ఎండు ఆకులను ‘యత్రీలస్’ అనే వానపాముల ద్వారా (ఆవు పేడ మరియు ఆకులు 1 1 నిష్పత్తిలో వర్మికంపోస్ట్న తయారు చేయవచ్చును. 10 కిలోల సేంద్రియ పదార్ధములకు వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. 10 కిలోల సంద్రియ పదార్ధముకు 50 వానపాముల చొప్పున వాడుకోవచ్చు. . 1-3 నెలల్లో సేంద్రీయ పదార్ధ కుళ్లి చక్కని వర్మికంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో సుమా 1.8% నత్రజని, 1% భాస్వరం, 0.16% పొటాషియం మొదలగు పోషకము ఉంటాయి. ఈ పద్ధతిలో కంపోస్ట్ను కొబ్బరిచెట్టు చుట్టూ గాడిచే గాడిలో కొబ్బరి ఆకులకు వానపాములను చేర్చి, గాడిలోనే ఎరువు. మార్చుకోవచ్చు. సుమారు 90 రోజులలో ఎరువు తయారవుతుంది.

2. కొబ్బరి పొట్టు కంపోస్ట్ : పొట్టును కుళ్లించు పూరోటస్ అను శిలీంధ్రము పొడిని (0.2%) ఉపయోగించి, సున్నము (5%), యూరియా (0.5%), రాక్ ఫాస్ఫేట్ (0.5%) మరియు ఆవుపేడ కలిపి కొబ్బరి పాట్టునుంచి ఎరువు తయారుచేసుకొనవచ్చును. సుమారు 2, 3 నెలల్లో కంపోస్ట్ ఎరువు తయారవుతుంది.. ఈ ఎరువునందు సుమారు 1.2 1.8% నత్రజని, 0.1 0.22% భాస్వరం, 0.1 0.4% పొటాషియం పోషకాలుటాయి. ఈ ఎరువును కొబ్బరి చెట్టుకు 20-25 కిలోల వరకు వాడుకోవచ్చు.

3. పచ్చిరొట్ట ఎరువులు: పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, బొబ్బర్లు (అలసంద) తొలకరి వర్షాలు పడగానే పెంచి, సుమారు 2 నెలలు తరువాత దుక్కిలో బాగుగా కలియ దున్నాలి. ఈ పచ్చిరొట్ట పైరుల వలన భూమిలో నత్రజని (6-7%), భాస్వరం (1-2%) మరియు పొటాష్ (4-5%) మొదలగు ముఖ్యపోషకాలు చేరుతాయి. ఇవే కాకుండా అనేక సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు లభ్యమవుతాయి…

4. చిక్కటి సేంద్రీయపు ఎరువులు: వేపపిండి, గానుగపిండి, వేరుశనగపిండి మొదలగు సేంద్రీయపు ఎరువులలో 3-8% వరకు నత్రజని, 1-2% భాస్వరం, పొటాషియం ఉంటుంది. వీటిని కూడా సేంద్రీయపు ఎరువులుగా చెట్టుకు 2-5 కిలోల చొప్పున వాడుకోవచ్చు..

5. స్థూల సేంద్రీయపు ఎరువులు : కంపోస్ట్ ఎరువు, పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేక లేక గొర్రెల ఎరువు మొదలగు స్థూల సేంద్రీయపు ఎరువుల్లో పోషకపు విలువలు తక్కవుగా ఉన్నా..మిగిలిన లాభాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఎరువులు మట్టిలో కలిసి భూమిని గుల్లబార్చి, తేమ ఎక్కువగా భూమిలో ఇంకేలా చేస్తాయి. ఈ ఎరువులో సుమారు 1-2 నత్రజని, 0.5 భాస్వరం మరియు 1% పొటాషియం కలిగి ఉంటాయి.

ఎరువుల వాడకం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే..కొబ్బరి సాగులో మంచి దిగుబడులు పొందవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news