భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో ఉన్నారు. మంగళవారం జరిగిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశారు. కాగా, మోడీ ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని రాష్ట్రల్లో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రిగా ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు నేను దేశానికి ప్రధానినని భావించలేదు. ప్రధానిగా డాక్యుమెంట్లపై సంతకాలు చేసినప్పుడే అలా భావించుకున్నా.. కానీ ఎప్పటికీ నేను ప్రధానిని కాదు.. కేవలం 130 కోట్ల మంది ప్రజల సేవకుడి మాత్రమే. నాకు ప్రజలే సర్వస్వం.’ అని అన్నారు.
గతంలో ఆత్కీ లట్కీ భట్కీ పథకాలు, బంధుప్రీతి, కుంభకోణాల గురించి చర్చలు జరిగేవని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వ్యాపార శైలి, స్టార్టప్‌ల గురించి చర్చిస్తున్నారని అన్నారు. ప్రజలతో మమేకం అవ్వడానికే ఈ సమ్మేళన్ కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పని తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు.