అదానీకి లైన్‌క్లియర్‌.. ఆ కంపెనీల్లో వాటా కొనుగోళ్లకు సీసీఐ గ్రీన్ సిగ్నల్

-

అంబుజా, ఏసీసీ సిమెంట్ కంపెనీల్లో వాటా కొనుగోళ్ల విషయంలో అదానీ గ్రూపునకు సీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వీడన్‌ కంపెనీ హోలిమ్స్‌కు చెందిన నియంత్రిత వాటాను కొనుగోలు చేసేందుకు కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఓకే చెప్పింది. అదానీ గ్రూప్‌కు చెందిన ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా హోలిమ్స్‌కు చెందిన హోల్డెరిండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, అంబుజా సిమెంట్స్, ఏసీసీలో వాటా కొనుగోళ్లకు ఆమోదం తెలిపినట్లు సీసీఐ పేర్కొంది.

ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం.. హోల్డెరిండ్‌లో ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు పూర్తి వాటా దక్కనుంది. ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ అదానీ గ్రూప్‌కు చెందినదే. మారిషస్‌ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. హోలిమ్స్‌కు అంబుజాలో 63.11 శాతం, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉన్నాయి. అంబుజా సిమెంట్‌కు ఏసీసీలో 50.05 శాతం ఉంది. ఈ క్రమంలో రెండు సిమెంట్‌ కంపెనీల్లో ఉన్న హోలిమ్స్‌ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది.

భాగంగా అంబుజా సిమెంట్స్, ఏసీసీకి 26 శాతం చొప్పున వాటా కొనుగోళ్లకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. దీంతో అంబుజాలో 89.11 శాతం వాటా, ఏసీసీలో 80.53 వాటా అదానీ గ్రూప్‌కు దక్కుతుంది. హోలిమ్స్‌ వాటా కొనుగోళ్లు, ఓపెన్‌ ఆఫర్‌ కలుపుకొని మొత్తం ఈ డీల్‌ విలువ రూ.81వేల కోట్లు. సాధారణంగా నిర్దిష్ట స్థాయికి మించిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదం తప్పనిసరి.

సీసీఐ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఒప్పందం విషయంలో అదానీ గ్రూప్‌కు లైన్‌క్లియర్‌ అయినట్లే. దీని ద్వారా ద్వారా ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ తర్వాత రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అదానీ గ్రూప్‌ అవతరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news