కోడీకలతో వ్యాపారం..కోట్లల్లో టర్నోవర్..!!

-

మన దగ్గర క్రియేటివ్‌ థాట్స్‌ ఉంటే.. ఎందుకు పనికిరాని వాటిని అయినా అందంగా తీర్చిదిద్దవచ్చు. కోడి ఈకలతో అసలేం చేస్తాం.. వాటిని ముట్టుకోవడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు. అలాంటి కోడీకలతో కోట్లల్లో బిజినెస్‌ చేస్తున్నారు ఆ జంట. అసలు వాటితో వ్యాపారం చేయాలని వాళ్లకు ఎలా అనిపించిందో కదా..!

వ్యర్థాలతో కంపోస్ట్ చేయడం, ఇంకా చెప్పాలంటే వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడం గురించి మనం వినే ఉంటాం. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కూడా చెత్త నుంచి సంపద అనే నినాదాన్ని బాగా వినిపిస్తున్నాయి. కాని మనం వేసుకునే దుస్తులను కూడా వ్యర్థాలతో తయారుచేయవచ్చని నిరూపించారు జైపూరుకు చెందిన ముదిత, రాజేష్ దంపతులు. కోడి ఈకలతో మనం ధరించే దుస్తులు తయారుచేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదట్లో వీరి ఐడియాను చూసి వెక్కిరించిన వారు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.

కాలేజీలోనే నాంది..

కాలేజీలో చదవుతున్నప్పుడు వచ్చిన ఈ ఆలోచనను వ్యాపారంగా మార్చారు. అయితే ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి కోట్ల రూపాయలు సంపాదించడం అంత తేలికేం కాదు. తనకు వచ్చిన ఆలోచనను కార్యరూపం దాల్చడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందట… మధ్యలో పరిస్థితులు అనుకూలించలేదు. అయినా సరే మొక్కవోని లక్ష్యంతో ముందుకెళ్తూ కోడి ఈకలతో దుస్తులు తయారుచేస్తూ ఏకంగా ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఈ దంపుతులు కోట్లలో టర్నోవర్‌ని సొంతం చేసుకున్నారు.

జైపూర్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్లో రాధేష్‌తో కలిసి ముదిత ఎంఏ చేస్తున్నప్పుడు వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారుచేసే అంశంపై ఓ ప్రాజెక్టు చేశారు. ఒకరోజు రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న ఓ చికెన్ దుకాణంలో నిలబడి ఉండగా.. కోడి ఈకలను చేతితో తాకాడు. అనుకోకుండా అతడికి ఓ ఆలోచన వచ్చింది. దానిని ముదితతో చెప్పగా.. ఇద్దరూ కలిసి వెంటనే దానిని ప్రాజెక్ట్‌గా మార్చారు. ఆ ఐడియాతో ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించారు. అయితే వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు 8 సంవత్సరాలు పట్టిందట.

ఎనిమిదేళ్ల కష్టం..

2010లో ప్రారంభమైన వారి ఆలోచన 2018లో కార్యరూపం దాల్చింది. దీనికోసం వారు ఎంతో కష్టపడ్డారు. వాస్తవానికి రాధేష్ కుటుంబం పూర్తి శాఖాహర కుటుంబం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఈ వ్యాపారానికి ససేమీరా అన్నారు. వ్యాపార పనులు జరుగుతున్నప్పుడు కూడా రాధేష్‌కు కుటుంబం ఎటువంటి సహకారం అందిచలేదు. ఆ సమయంలో ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సరే ఇబ్బందులు పడుతూనే తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు రాధేష్, ముదిత దంపతులు.

గతంలో కోడి ఈకలతో దుస్తులు తయారుచేసే వ్యాపారాన్ని ఎవరూ చేసిన దాఖలాలు లేవు. బుక్స్, ఇంటర్నెట్‌లోనూ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఎంతో రీసెర్చ్ తర్వాత కోడి ఈకలను దుస్తులుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు. అయితే కోడి ఈకలను ఉపయోగించి దుస్తులు తయారుచేయడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తయారుచేసిన దుస్తుల సేల్ చేయడం ఇంకా కష్టం..ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. కోడి ఈకలతో తయారుచేసిన దుస్తులంటే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే కోడి ఈకలతో తయారుచేసిన శాలువాలకు భారత్‌తో పోలిస్తే విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని తెలుసుకుని అప్పటి నుంచి వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు..

వందలాది మందికి ఉపాధి..

చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమైన వారి ఆలోచన ఇప్పుడు ఓ పెద్ద పరిశ్రమగా రూపుదిద్దుకుంది. గత రెండేళ్లలో ఐదు కోట్లకు పైగా వ్యాపారం చేయగా.. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.2.5 కోట్లకు చేరడం అంటే మూములు విషయం కాదు.. అంతేకాదు ఈ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారట… కళాశాల స్థాయిలో పుట్టిన ఒక ఆలోచన నేడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి ఆలోచన వచ్చినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు వీరిని ఎవరూ గుర్తించలేదు.. ఎప్పుడైతే వారు ఆ ఆలోచనతో విజయం సాధించారో అప్పుడు అందరీ కన్ను వారి మీద పడింది. న్యూస్‌ ట్రెండ్‌ అయింది..నెట్టింట వైరల్‌ అవుతోంది.!

Read more RELATED
Recommended to you

Latest news