ఒక్క మాటతో అన్ని పుకార్లకి చెక్క్ పెట్టిన ఆచార్య..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల సందేహాలు వెల్లడవుతున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన అన్ని చిత్రాల షూటింగులు ఒక్కొక్కటిగా మొదలవుతుంటే ఆచార్య టీమ్ మాత్రం చప్పుడు చేయకుండా ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆచార్య సినిమా కథ కాపీ అంటూ అప్పట్లో రాజేష్ అనే ఒక వ్యక్తి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల కారణంగా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని, అందువల్లే సినిమా ఆలస్యం అవుతుందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఐతే వీటన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, అద్బుతమైన వార్తతో ముందుకు వచ్చింది. ఆచార్య చిత్ర షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందో చెప్పేసింది. నవంబరు 9వ తేదీ నుండి ఆచార్య చిత్రీకరణ మొదలవబోతుందని, షూటింగ్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నామని తెలిపారు. వేసవి కానుకగా ఆచార్య థియేటర్లలో సందడి చేయనుందని క్లారిటీ ఇచ్చేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.