కొన్నేండ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని పద్మ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు. గద్దర్ అవార్డులను త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవింపబడుతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో పద్మ పరస్కారాలకు ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.
పద్మవిభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదని చెప్పారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని చెప్పారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదని వెల్లడించారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని తెలిపారు. దివంగత ప్రధాని వాజ్‌పేయీ అంత హుందాతనం ఆయనలో ఉందన్నారు.