ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమను కన్నీటి సాగరంలో ముంచి వెళ్లిపోయారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతి చెందారు. శరత్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక నటుడు శరత్ బాబు భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఫిలింనగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు.
ఇందుకోసం ఏఐజి ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని చెన్నైకి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇక శరత్ బాబు మరణం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. అన్ని పాత్రల్లో మెప్పించిన విలక్షణ నటుడు శరత్ బాబు అని ట్వీట్ చేశారు. శరత్ బాబు మరణం సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తలసాని పేర్కొన్నారు.