అవతార్ 2 సినిమా భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుదల అయ్యి ఇప్పటికే 38 రోజులు అయ్యింది. అయినాసరే ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముందు నుండి విడుదల అయిన అవతార్ 1 చూసి ఎంతో మంది అవతార్ 2 కూడా సూపర్ గా ఉంటుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానితో రెండో భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు.
ఇక మొదటి నుండి ఈ సినిమా త్రీడీ లో చూడాలని అప్పుడే మాత్రమే సినిమా అసలైన ఫీలింగ్ ఇస్తుందని చెప్పడంతో త్రీడీ థియేటర్స్ వీకెండ్ లో ఇప్పటికీ ఖాళీ ఉండటం లేదు. ఇప్పుడు ఈ వండర్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా 2 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు చేసిన 6వ చిత్రంగా నిలిచింది.
ఈ సినిమా తో జేమ్స్ కామెరూన్ అరుదైన క్లబ్ లోకి అడుగు పెట్టాడు. ఆయన ఇప్పటి వరకు 2 బిలియన్ డాలర్లు వసూళ్లు సంపాదించిన 3 సినిమాలు తీసి ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఏకైక దర్శకుడిగా నిలిచాడు. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకెన్స్ ($2.07 బిలియన్లు) మరియు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ($2.05 బిలియన్లు) జీవితకాల కలెక్షన్లను అధిగమించి, ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన 4వ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.