ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో `రూలర్` సినిమా పనుల్లో బిజీగా ఉన్నడు నందమూరి బాలకృష్ణ. ఇక ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాయి. ఇదిలా ఉంటే.. గతంలో బాలకృష్ణ చేసిన కొన్ని చిత్రాలలో బాలీవుడ్ భామలు మెరిసిన సంగతి తెలిసిందే.
అయితే ఆయన తదుపరి చిత్రంలోను బాలీవుడ్ భామను తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితం కానున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నారట. ఆమె ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇక ప్రతి నాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్ ను అనుకున్నారట. ఆయనతోను చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఇద్దరి రాక వలన ఈ ప్రాజెక్టు క్రేజ్ మరింత పెరగడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.