సినిమా ఇండస్ట్రీపై ‘వరుడు’ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

వరుడు సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన భానుశ్రీ మెహ్రాకు ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి ఛాన్సులివ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపలేదు. 2021 వరకూ పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు విజయం దక్కలేదు. ప్రస్తుతం యూట్యూబ్‌ వేదికగా నెటిజన్లను ఆమె అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికరంగా ట్వీట్ చేసింది.

‘‘వయసు.. సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రల్లో నటిస్తుంటారు. తమకంటే వయసులో చాలా చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు? పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. ధైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ ప్రోత్సహించాల్సిన సమయం ఇది. దీనిని మీరూ అంగీకరిస్తారా?’’ అని భానుశ్రీ ప్రశ్నించారు.