ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి.. కేంద్రానికి మెగాస్టార్ చిరంజీవి విజ్ఞ‌ప్తి

న‌ట‌నా రంగంలో విశ్వ‌విఖ్యాత‌, సార్వ‌భౌమ‌, మ‌హా నాయ‌కుడు అయిన నంద‌మూరి తార‌క‌రామారావు 98వ జ‌న్మ‌దినం ఈ రోజు. ఈ రోజు తెలుగు చిత్ర సీమ‌కు ఈ ఖ్యాతి ఉందంటే దానికి కార‌ణం ఆ మ‌హానుభావుడే. ఆయ‌న వేసిన బాట‌లే టాలీవుడ్‌కి మార్గ‌ద‌ర్శ‌కం అయింది. అలాంటి మ‌హానుభావుడి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

 

ఎన్టీఆర్ లాంటి దేశం గర్వించ‌ద‌గ్గ నాయ‌కుడిని ఈ రోజు అంద‌రూ స్మ‌రించుకోవాల‌ని చిరంజీవి కోరారు. అలాగే ప్రముఖ‌ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికకు ఎలాగైతే కేంద్రప్రభుత్వం ఆయ‌న మరణాంతరం భారతరత్న ఇచ్చి గౌరవించిందో అలాగే సినిమాల్లో, రాజ‌కీయాల్లో ఎన‌లేని సేవ‌లందించిన ఎన్టీఆర్‌కు కూడా కేంద్ర ప్ర‌భుత్వం భారతరత్న ఇవ్వాల‌ని చిరంజీవి కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.

అలా ఇస్తే దాన్ని తెలుగు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన గౌర‌వంగా భావిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఆయ‌న చేసిన సేవ‌ల‌ను స్మ‌రించుకుంటూ చిరంజీవి ట్విట్ట‌ర్‌లో ఈ విధంగా పోస్టు చేశారు. ఇక ఎన్టీఆర్ తో క‌లిసి చిరంజీవి తిరుగులేని మనిషి సినిమాలో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.