వెన్నెలకంటి స్పెషల్:మౌన రాగం మూగబోయింది

తెలుగు సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ కన్నుమూశారు.ఎన్నో ఆశలతో ప్రారంభమైన 2021లో దక్షిణాది చిత్రపరిశ్రమ‌లో విషాదం నెలకొంది. తమిళ పాటలను తెలుగు పాటలు అనిపించేలా ఎంతో మధురమైన సాహిత్యాన్ని అందించిన వెన్నెలకంటి ఇకలేరు. వెన్నెలకంటి కలం నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి.

వెన్నెలకంటి అసలు పేరు రాజేశ్వరప్రసాద్‌. ఆయన ఇంటి పేరు వెన్నెలకంటి . సుమారు 300పై చిలుకు సినిమాల్లో రెండువేలకు పైగా పాటలు రాశారు. ఆ 300 సినిమాల్లో 270కి పైగా సినిమాలు అనువాద చిత్రాల్లోని పాటలే… 1988లో విడుదలైన మహర్షి సినిమాలో సూపర్‌ హిట్‌ సాంగ్‌ ఇది. వెన్నలకంటి రాసిన ఈ పాట ఎవర్‌ గ్రీన్ సాంగ్. అప్పట్లో ఏనోటా విన్నా ఇదే పాట. మౌన ప్రేమకు అక్షర రూపం. పదాల కూర్పు ఎంతో అద్భుతంగా ఉంటుంది.

మౌనంతో ముగించి.. మౌనంతోనే ఆరంభించడం.. గానంతో ముగించి.. గానంతోనే ఆరంభించడం… ఇలా మొదలుపెట్టి రాసిన పాటకు ఇళయ రాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వెన్నెలకంటి సాహిత్యం ఎలా ఉంటుందో చెప్పడానికి మచ్చుతునక ఈపాట డబ్బింగ్ చిత్రాల పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరంటే.. వెన్నెలకంటినే. పాటలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలకు మాటలు, స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వెన్నెలకంటి సేవలందించారు. 1979లో చంద్రగిరి ఎస్బీఐలో పనిచేస్తున్న సమయంలో సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వెన్నెలకంటి సినీరంగంలో అడుగుపెట్టారు…

ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, సమరసింహారెడ్డి, శీను వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన చివరిగా పెంగ్విన్ సినిమాకు పనిచేశారు.హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభమైంది. 34 ఏళ్లలో 1500లకు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు.

మహర్షి సినిమా పాటలు హిట్‌ కావడంతో.. వెన్నెలకంటికి వంశీ ‘చెట్టుకింద ప్లీడర్‌’ సినిమాకు అవకాశం ఇచ్చారు.చల్తీకా నామ్‌ గాడీ.. సిట్యువేషన్‌ సాంగ్‌ కాగా.. డొక్కు కారును గురించి పొగడటం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. ”అశోకుడు యుద్ధంలోన వాడింది ఈ కారు.. శివాజీ గుర్రం వీడీ ఎక్కింది ఈ కారు” అంటూ చరణంలో పలికే ప్రగల్భాలు చెట్టుకింద ప్లీడరు సినిమాలో బాగా పండాయి. ఈ సినిమాలోని ”అల్లిబిల్లి కలలా రావే.. అనే పాట కూడా సూపర్‌ హిట్‌ అయింది.

పాటలు అందరూ రాస్తారు.. కానీ, కథలోని సన్నివేశం, సందర్భం రక్తికట్టేలా పాటలు రాసేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. వెన్నెలకంటి కలం పట్టుకుంటే అది ఏ భాష సినిమా అయినా, తెలుగువాడి గుండెకు హత్తుకునేలా సంభాషణలు, మాటలు ఉంటాయి. అద్భుతమైన పదజాలంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది వెన్నెలకంటి సాహిత్యం. ఇప్పుడు ఆ కలం మౌనం వహించింది. కానీ, ఆ మాటలు, ఆ పాటలు ఎప్పటికీ ఉంటాయి.