దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై రకరకాల విమర్శలు తలెత్తుతున్నాయి. తాజాగా హీరో నిఖిల్ ఈ విషయంపై స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒక సినిమాపై చూపించే ప్రేమాభిమానం ఆ సినిమాకు ఆస్కార్ కంటే గొప్పదన్నారు.
నిఖిల్ ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ..”నన్ను క్షమించండి. నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరు ఆస్కార్‌ను ఇష్టపడతారు. కానీ ఒక సినిమాకు అతి పెద్ద విజయం ఏంటంటే అది ప్రజల నుంచి ప్రేమ, ప్రశంసలను పొందడమే. అదే అతి పెద్ద అవార్డు. ”ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఎంతో ఆదరించారు. అదే ఈ చిత్రానికి పెద్ద విజయం. మరి.. మనకిక ఆస్కార్ ఎందుకు? అని అన్నారు.”
”ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి.. అసలు మనకు అస్కార్ నుంచి సర్టిఫికేట్ ఎందుకు? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. విడుదలైన అన్నిచోట్లా భారతీయ సినిమాలు దూసుకుపోతున్నాయి. నేను స్పెయిన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూశాను. థియేటర్‌లు అన్ని హౌస్‌ఫుల్‌గా ఉన్నాయి. స్పానిష్ ప్రజలు సినిమా చూడడానికి మళ్లీ మళ్లీ సినిమా హాలుకు వస్తున్నారు. ఇక, మనకు ఆస్కార్ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.