ఒక సినిమా హిట్ కావాలంటే మొదట మ్యూజిక్ హిట్ కావాలని సినీ పరిశీలకులు చెప్తుంటారు. సంగీతం విజయం సాధించినట్లయితే సినిమా సగం విజయం సాధించినట్లు అని అంటుంటారు. అలా సినిమా విజయంలో మ్యూజిక్ కు పాత్ర ఉంటుంది. అయితే, సాంగ్స్ ను ఆడియోగా వినడంతో పాటు వెండితెరపైన చూసినపుడు అత్యద్భుతంగా కనబడాలి. అందుకు ఇప్పుడు సాంగ్ ను కొరియోగ్రఫీ చేసే మాస్టర్స్ ఉన్నారు.
కొరియోగ్రాఫర్ సాంగ్ కు తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేయడంతో పాటు లైటింగ్ ఇతర విషయాలు చూసుకుంటారు. కాగా, ఓ సినిమాకు కొరియోగ్రాఫర్ అవసరం లేకుండా ఎనిమిది పాటలు తీశారు ఓ దర్శకుడు. అందుకుగాను ఆ దర్శకుడికి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు రావడం విశేషం. ఆ దర్శకుడు ఎవరంటే సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు.
దర్శకేంద్రుడిగా పేరు గాంచిన కె.రాఘవేంద్రరావు పాటలు తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. మేక శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లి సందడి’ చిత్రంలో ఎనిమిది పాటలకు కె.రాఘవేంద్రరావు కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఇక పాటలన్నీ కూడా మ్యూజికల్ గా చాలా హిట్ అయ్యాయి.
ఈ చిత్రంలోని ప్రతీ పాటను చాలా అందంగా వెండితెరపైన ఆవిష్కరించారు దర్శకుడు. హీరోయిన్స్ రవళి, దీప్తి భట్నాగర్ లను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా బాగా చూపించారు. అశ్వనీదత్ , అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ కు సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.
ఇటీవల విడుదలైన ‘పెళ్లి సందD’ చిత్రంతో దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగానూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషణ్ నటించాడు.