ఎమోష‌న‌ల్ జ‌ర్నీ.. ‘మ‌హ‌ర్షి’ రివ్యూ

-

నటులు: మహేశ్ బాబు, అల్లరి నరేశ్, పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయసుధ, రావు రమేశ్, వెన్నెల కిశోర్.. తదితరులు..
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి
కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్
ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్

మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు 24 సినిమాలు చేశారు. రాజ‌కుమారుడుతో ప్రారంభ‌మైన హీరోగా ఆయ‌న కెరీర్ 20ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ జ‌ర్నీలో మురారి, ఒక్క‌డు, అర్జున్‌, పోకిరి, అత‌డు, దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను వంటి హిట్ చిత్రాలు చేశారు. చాలా సినిమాలు పోయినా మ‌హేష్ ఇమేజ్ ఎప్పుడూ త‌గ్గ‌లేదు. శ్రీమంతుడు సినిమాతో ఆడియెన్స్, జ‌నాల‌పై బ‌ల‌మైన ఇంపాక్ట్ ని వేసి అంద‌రికి ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్ప‌డు త‌న కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి 25వ సినిమా మ‌హ‌ర్షిని వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేశారు. ఇది గురువారం విడుద‌లైంది. మ‌రి మ‌హేష్ తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునేంత‌?, తాను మైల్ స్టోన్‌గా భావించేంత‌టి అంశం ఇందులో ఏముంద‌నేది తెలుసుకుందాం..

క‌థః కె.రిషికుమార్(మ‌హేష్‌బాబు) ప్ర‌పంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీ అయిన‌ ఆరిజిన్ కంపెనీ సీఈవోగా అప్పుడే బాధ్య‌త‌లు తీసుకుంటారు. అత‌ని ఆదాయం ఏడాదికి రూ.950కోట్లు. సీఈఓగా బాధ్య‌త‌లు తీసుకున్నాక త‌న స్నేహితులు, ప్రొఫేస‌ర్(రావు ర‌మేష్‌) ద్వారా గ‌తం గుర్తు చేసుకుంటాడు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన రుషి త‌న తండ్రి కె.స‌త్య‌నారాయ‌ణ‌(ప్ర‌కాష్ రాజ్‌) లాగా ఓడిపోతూ బ‌త‌క‌డం ఇష్ట‌ప‌డ‌డు. ఎలా బ‌త‌క కూడ‌దో త‌న తండ్రి నుంచే నేర్చుకుని ఎప్ప‌టికైనా ప్ర‌పంచాన్ని ఏలేద్దామ‌నుకునే వ్య‌క్తి. ఓడిపోవ‌డం తెలియ‌ని వ్య‌క్తి. ఎప్పుడూ గెలుపుకోసం త‌పించే వ్య‌క్తి. విశాఖ‌ప‌ట్నంలోని ఐఐఈటీ కాలేజ్‌లో సీటు సంపాదిస్తాడు. అక్క‌డ ర‌వి(రిషికుమార్), పూజా(పూజా హెగ్డే) స్నేహితులుగా మార‌తారు. రిషిలోని ఇంట‌లిజెన్సీని చూసి పూజా రిషి ప్రేమ‌లో ప‌డుతుంది. కానీ అవేమి త‌న ల‌క్ష్యానికి అడ్డు రాకూడ‌ద‌ని ప్రేమ‌ని వ‌దిలేస్తాడు. కాలేజ్‌లో త‌న‌పై ప‌డ్డ నింద నుంచి బయ‌ట‌ప‌డి, ఓ సాఫ్ట్ వేర్‌ని క‌నిపెట్టి అమెరికా వెళ్ళిపోయి ఆరిజిన్ కంపెనీకి సీఈవో అవుతాడు. ప్రొఫేస‌ర్ చెప్పిన విష‌యాల ద్వారా ర‌వి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? త‌న గెలుపు వెనకాల ఉన్న వ్య‌క్తులెవ‌రు? తండ్రి మ‌ర‌ణం ఏం నేర్పింది? అత‌నికి, రైతుల‌కు సంబంధ‌మేంటి?, రిషి .. మ‌హ‌ర్షిగా ఎలా మారాడ‌నేది మిగిలిన సినిమా.

విశ్లేష‌ణః మహేష్‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టించిన 25వ చిత్ర‌మిది. ఓ మైలురాయి లాంటి సినిమా కోసం ఏం ఉండాలో, ఏం కావాలో అవ‌న్నీ ఇందులో ఉన్నాయి. ఫ్యాన్స్ కి కావాల్సిన మూవ్‌మెంట్స్, పాట‌లు, ఫైట్స్ ఉన్నాయి. కాలేజ్ ఎపిసోడ్ కాసేపు న‌వ్విస్తుంది, మ‌రి కాసేపు భావోద్వేగానికి గురిచేస్తుంది. మొద‌టి భాగ‌మంతా చాలా స్లోగా సాగుతుంది. ఒకానొక స‌మ‌యంలో బోర్ ఫీల‌వుతాం. పైగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ త‌క్కువ‌. అదే స‌మ‌యంలో టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా స‌క్సెస్ గురించి హీరో క్లాస్ పీకే ఎపిసోడ్స్ కాస్త ఇబ్బంది పెట్టే అంశాలు. త‌న స‌క్సెస్‌కి కార‌ణం ఫ్రెండ్ ర‌వి కార‌ణ‌మ‌ని తెలుసుకుని ఇండియాలోని రామ‌వ‌రంకి వ‌చ్చాక అస‌లు క‌థ స్టార్ట్ అవుతుంది.

గ్యాస్ కోసం ప‌చ్చ‌ని ఫైర్ల‌తో నిండే గ్రామాల‌ను ఖాళీ చేయించేందుకు కార్పోరేట్ న‌వీన్ మిట్ట‌ల్‌(జ‌గ‌ప‌తిబాబు) చేస్తున్న ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట వేసి, త‌మ ఊళ్ళ‌ని కాపాడుకోవడానికి ర‌వి చేసే పోరాటానికి మ‌ద్ధ‌తుగా నిలిచి రిషి గ్రామాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. గ్రామంలోని సంఘ‌ట‌లు భావోద్వేగానికి గురి చేస్తాయి. అదే స‌మ‌యంలో కార్పొరేట్ల స‌వాల్‌, గ్రామంలో ప్రెస్‌మీట్‌ల గోల కాస్త విసుగు పుట్టించే అంశాలు. చివ‌ర‌గా రైతుల స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఎంచుకున్న పాయింట్ ఆక‌ట్టుకుంటుంది. ఆడియెన్స్ కి బాగా క‌నెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ అర‌గంట పాటు సినిమా మ‌రో స్థాయికి వెళ్తుంది. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ప్ర‌భుత్వం తీరు, కార్పొరేట్ల‌కు ప్ర‌భుత్వాలు ఎలా తొత్తులుగా మారుతున్నాయో స్ప‌ష్టంగా క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ప‌రోక్షంగా అంబానీల వంటి కార్పొరేట్ల‌ ఆగ‌డాల‌ని చూపించారు. బ‌తికున్న ప్ర‌తి ఒక్క‌రికి ఆధారం రైతే. వాళ్ళ‌పై జాలి చూప‌డం కాదు, వారిని, వారి వృత్తిని గౌర‌వించాల‌ని చెప్పే అంశాలు ఆక‌ట్టుంటాయి. కాలేజ్ టైమ్‌లో విద్య వ్య‌వ‌స్థ‌లోని మూస ధోర‌ణుల‌ను ప్ర‌తిబింబించారు. అదే స‌మ‌యంలో స‌క్సెస్ అంటే డ‌బ్బు కాదు, మ‌నుషులు, మ‌నుసు, భావోద్వేగాలు, మ‌న చుట్టూ ఉండేవారిని సంతోషంగా ఉంచ‌డ‌మ‌ని చెప్పే స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

ఆర్టిస్టుల ప‌రంగా మ‌హేష్‌బాబు విద్యార్థిగా, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడిగా, కంపెనీ సీఈవోగా, రైతుల కోసం పోరాడే వ్య‌క్తిగా త‌న‌లోని విభిన్న కోణాల‌ని ఆవిష్క‌రించారు. గ‌త చిత్రాల‌కు భిన్నంగా లుక్ వైజ్‌గానూ ఆక‌ట్టుకున్నారు. పంచ్ డైలాగ్‌లు, ఎమోష‌న్స్ సీన్స్ లో త‌న బెస్ట్ ఇచ్చారు. పూజా హెగ్డే పాత్ర‌లో న‌ట‌న‌కు స్కోప్ త‌క్కువ‌. ఉన్నంత‌లో ఆక‌ట్టుకుంది. కాక‌పోతే ఆమె పాత్ర జ‌ర్నీలో క్లారిటీ లేదు. అల్ల‌రి న‌రేష్ ర‌విగా పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. ప్రొఫేస‌ర్‌గా రావు ర‌మేష్ కాసేపైగా త‌న అనుభ‌వాన్ని చూపించారు. ఆయ‌న పాత్ర‌కి, ఫ్రెండ్‌గా చేసిన వెన్నెల కిషోర్ పాత్ర‌కి స‌రైన ముగింపు లేదు. త‌ల్లిగా జ‌య‌సుధ‌, తండ్రిగా ప్ర‌కాష్ రాజ్‌, కార్పొరేట్‌గా జ‌గ‌ప‌తిబాబు ఉన్నంతలో మెప్పించారు.

టెక్నిక‌ల్ విష‌యాల ప‌రంగా ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి ఎంచుకున్న పాయింట్ చాలా బ‌ల‌మైంది. త‌న‌కి లైఫ్ ఇచ్చిన ఫ్రెండ్ కోసం ఏదైనా చేసే స్నేహితుడు గురించి చెప్పి స్నేహం, మాన‌వ విలువ‌ల‌ని చాటారు. దీంతోపాటు రైతుల స‌మ‌స్య‌ని మ‌రింత కాస్త డిటెయిల్డ్ గా చెప్పాల్సింది. అప్పుడే క‌థ మ‌రింత ర‌క్తి క‌ట్టేది. రిషి జ‌ర్నీ చెప్పే క్ర‌మంలో చాలా లాజిక్స్ వ‌దిలేశారు. కొన్ని మైన‌స్‌లు ప‌క్క‌న పెడితే ద‌ర్శ‌కుడిగా ఆయ‌న మంచి మార్కులే కొట్టేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం ఇప్ప‌టికే మంచి ఆద‌రణ పొందుతుంది. విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌గా ఉన్నాయి. నిడివి ప‌రంగా సినిమా బాగా ఎక్కువైంది. సుమారు అర‌గంట ఎడిట్ చేస్తే సినిమా మ‌రింత అందంగా ఉండేది. దీని వ‌ల్ల మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమా కేవ‌లం యావ‌రేజ్‌గా నిలిచింద‌నే చెప్పాలి. నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. సూప‌ర్ అనే చెప్పాలి. రైతుల‌ను గౌర‌వించాల‌నే కాన్సెప్ట్, వీకెండ్ అగ్రీక‌ల్చ‌ర్ అంశాలు అభినందించ‌ద‌గిన‌వి. ఫైన‌ల్‌గా ఇదొక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అని చెప్ప‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news