అమ్మ గురించి మహేశ్‌ బాబు ఏం చెప్పారంటే..?

-

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

అయితే అమ్మ గురించి మహేశ్ చెప్పిన కొన్ని డైలాగ్​లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రిరీలిజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో ఇందిరాదేవీ గురించి మహేశ్ పలు వ్యాఖ్యలు చేశారు. ”నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ సినిమా రిలీజైనా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం. ఆమె ఆశీస్సుల వల్లే నాకు ఈ విజయం వచ్చింది”’.. ఇవి ‘మహర్షి’ సక్సెస్‌ మీట్‌లో మహేశ్‌బాబు తన తల్లి ఇందిరా దేవి గురించి మాట్లాడిన మాటలు. బుధవారం తెల్లవారుజామున ఇందిరా దేవి మరణంతో ఈ వీడియోను సోషల్‌మీడియాలో అభిమానులు పోస్టు చేస్తున్నారు.

మాతృమూర్తి పట్ల మహేశ్‌కున్న ప్రేమను ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. #MaheshBabu హ్యాష్‌ట్యాగ్‌ని జత చేస్తూ ‘ధైర్యంగా ఉండండి అన్నా’ అని చెబుతున్నారు. మహేశ్‌ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలోని తల్లి సెంటిమెంట్‌ సీన్‌ను కూడా షేర్‌ చేస్తున్నారు. తన తల్లి పుట్టిన రోజైన ఏప్రిల్‌ 20 తనకెంతో ప్రత్యేకమని.. అదే రోజున తాను నటించిన ‘భరత్‌ అనే నేను’ విడుదల కావడం ఆనందంగా ఉందని ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మహేశ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news