పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. తన అభిప్రాయాలని పోడ్ కాస్ట్ ద్వారా చాలా నిక్కచ్చిగా వినిపిస్తున్నారు. ఆయన సినిమాల్లో డైలాగుల మాదిరిగానే పోడ్ కాస్ట్ కూడా బాగా ఆకర్షిస్తుంది. తాజాగా ఆయన అత్తా కోడలి గురించి చేసిన పోడ్ కాస్ట్ ఆసక్తిగా ఉంది.
కొడుక్కి పెళ్ళెప్పుడవుతుందా కోడలు ఇంటికి ఎప్పుడు వస్తుందా అని ప్రతీ తల్లి ఎదురుచూస్తుంటుంది. అటు వైపు కోడలు కూడా అత్తగారిని బాగా చూసుకోవాలనే అనుకుంటుంది. కానీ పెళ్ళయ్యాక కథంతా మరిపోతుంది. పెళ్ళి కాక ముందు ఏదైనా అమ్మతో చెప్పే కొడుకు, పెళ్ళయ్యాక అన్నీ పెళ్ళాంతో చెబుతుంటాడు. దాంతో అమ్మ హర్టు అవుతుంది. అత్తకి పెందలాడే నిద్రలేచే అలవాటు. కోడలికి అది ఉండదు. దాంతో గొడవలు మొదలవుతాయి.
దాంతో ఒకరి మీద ఒకరు డామినేషన్ చేయడానికి ట్రై చేస్తారు. కొడుకు ఇంటికి రాగానే కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. ఇద్దరికీ ఏమి చెప్పాలో కొడుక్కి అర్థం కాదు. ఇక్కడ ఎంత పోటుగాడయినా ఏమీ చెప్పలేడు. అందుకే అత్త కోడళ్ళు ఇద్దరూ ఒక దగ్గర ఉండకూడదు. వారానికి ఒకసారో, నెలకి ఒకసారో కలవాలి తప్ప, ఒకే ఇంట్లో ఉండకూడదు. వారిద్దరూ రెండు జెనరేషన్లకి చెందినవారు. వారిని కలిపి ఉంచాలనుకోవడం సాధ్యం కాదు.
ఐతే అత్తాకోడళ్ళ మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం జరుగుతూనే ఉన్నా, కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే వారిద్దరూ ఒకటవుతారు. ఆర్థిక కారణాల ఇంట్లో దరిద్రం తాండవిస్తున్నప్పుడు, కొడుక్కి మరెవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసినపుడు..
ఇక్కడ పూరీ జగన్నాథ్ చాలా ఆసక్తికరమైన పాయింట్ చెప్పాడు. అత్తా కోడళ్ళ మధ్యనే ఎందుకు గొడవలొస్తాయి. మామా అల్లుళ్ళు ఎందుకు కొట్టుకోరు, మామ కోడళ్ళు ఎందుకు గొడవ పడరు..? ఎందుకంటే ప్రతీ మహిళ, తనకి తానే రాణి అనుకుంటుంది. అందుకే ఒకే ఇంట్లో ఇద్దరు రాణిలు ఉండలేరు. అందుకే ఇద్దరికీ వేరు వేరు రాజ్యాలు నిర్మించండి..
చివరిగా, ఏదైనా ఫంక్షన్ లో అత్తాకోడళ్ళు అన్యోన్యంగా కనిపిస్తే నమ్మకండి. చుట్టాలు, ఫోటో గ్రాఫర్లు ఉన్నప్పుడు వాళ్ళు అలాగే నటిస్తారంటూ ముగించాడు.