డ్రగ్స్ కేసు.. ఢిల్లీ హైకోర్టుకు రకుల్‌ ప్రీత్‌..!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. తాజాగా ఆ సెగ టాలీవుడ్ కి కూడా తాకింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ప్రేయసి రియాను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె రకుల్ సహా పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిందని తెలియడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తాజాగా ఈ అంశంపై నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

మాదక ద్రవ్యాల కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా మీడియాలో ప్రసారాలపై కోర్టు స్పందించింది. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని హైకోర్టు సూచించింది. అలాగే పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.