ఏపీలో ప్రమాదకరమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిపై మతపరమైన కుట్రకు కొందరు తెరలేపినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. పరిపాలనలో ఎవరున్నారన్న విషయాన్ని వదిలేసి జగన్ పై ఉద్దేశ్యపూర్వకంగా మతం బురద చల్లేందుకు అధికారపార్టీ ఎంపితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై విధానపరమైన ఆరోపణలు, విమర్శలు ఎన్నైనా చెయచ్చు తప్పులేదు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను జనాల్లో ఎండగట్టడం కూడా ప్రతిపక్షాల బాధ్యతనటంలో సందేహం లేదు.
కానీ తనను ఘోరంగా ఓడించారనే మంటతో జగన్ పై పదే పదే హిందువులకు వ్యతిరేకమన్న ముద్ర వేయాలని చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తోంది. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం నుండి వైసీపీ అరాచకాలు మొదలయ్యాయంటూ విచిత్రమైన ఆరోపణ చేశారు. అన్యమతస్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలట. ఈ నియమాన్ని పాటించటంలో జగన్ ప్రవర్తన బాధాకరమంటూ చంద్రబాబు ఇపుడు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
అన్యమతస్తులు శ్రీవారి దర్శనం కోసం వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన వాస్తవమే. కానీ జగన్ కు ఈ నిబంధన ఎలా వర్తిస్తుందో చంద్రబాబు చెప్పలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా జగన్ చాలాసార్లు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళారు. అప్పుడు ఏ అధికారి కూడా డిక్లరేషన్ ఇవ్వమని జగన్ను అడగలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా జగన్ తిరుమలకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చంద్రబాబు అప్పుడెందుకు డిమాండ్ చేయలేదు ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎన్నోసార్లు శ్రీవారి ఆలయంకు వెళ్ళారు కదా. అప్పుడెప్పుడు ఎవరు ఆయన్ను డిక్లరేషన్ ఇవ్వమని ఎందుకు అడగలేదు ? వైఎస్ విషయంలో అన్యమతస్తుడు అనేది వివాదం కానపుడు, ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా గుర్తుకురాని విషయం జగన్ విషయంలో ఇపుడే ఎందుకు చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు ? ఎందుకంటే తనను ఘోరంగా ఓడించారనే మంట చంద్రబాబులో పేరుకుపోయింది. మామూలుగా ఎన్నికలైపోయిన తర్వాత మెల్లిగా ఓటమి బాధ తగ్గిపోతుంది. కానీ చంద్రబాబులో రోజురోజుకు పెరిగిపోతున్నట్లుంది.
దాన్ని తట్టుకోలేకే జగన్ పై అన్యమతస్తుడనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి ఇదే అంశాన్ని వైసిపి తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు లేవదీశారు. ఇపుడు చంద్రబాబు కూడా అందుకున్నారు. చూస్తుంటే వీళ్ళిద్దరు కూడబలుక్కునే దుష్ప్రచారానికి తెరలేపినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆలయాల విషయంలో కొన్ని ఘటనలు జరిగటానికి జగన్ అన్యమతస్తుడనటానికి ఏమన్నా సంబంధం ఉందా ?
ఆమాటకొస్తే చంద్రబాబు హయాంలో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు జరగలేదా ? 2017లో పెంటపాడులోని దేవాలయంలో రథం తగలబడలేదా ? 2019, ఏప్రిల్ లో నే తిరుమలకు వెళ్ళే బస్సుల టికెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగలేదా ? తన హయాంలో జరిగిన వాటిని కూడా జగన్ హయాంలో జరిగినట్లు చంద్రబాబు ఆపాదించేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విషయంలో కావాలనే మతపరమైన కుట్రకు దిగటం నిజంగా దురదృష్టమే..!
-Vuyyuru Subhash