తొలి సినిమా ప్లాఫ్‌కు బాధ్యతంతా తనదే అన్నట్లు.. కొద్ది నెలల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్నారు కృష్ణంరాజు. ఆ సమయంలో తనను తాను పరిపూర్ణ నటుడిగా తీర్చిదిద్దుకున్నారు. నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత వరుసపెట్టి విలన్ పాత్రలు చేశారు. అనంతరం సొంత బ్యానర్‌పై హీరోగా మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కృష్ణం రాజురెబల్‌స్టార్‌గా ఎదిగారు. విభిన్నమైన నటనతో.. ప్రత్యేకమైన స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. బావబావమరిది, పల్నాటి పౌరుషం చిత్రాల్లో రోషంతో కూడిన కరుణరస పాత్రలు వేశారు. మా నాన్నకు పెళ్లితో యువతరంతో నటించడం మొదలుపెట్టిన కృష్ణం రాజు.. రుద్రమదేవి సినిమాలో గణపతి దేవుడిగా నటించి మెప్పించారు.
తెలుగుసినీ పరిశ్రమలో విలన్‌గా దూసుకువెళ్తున్న సమయంలో గోపీకృష్ణా మూపీస్ బ్యానర్‌ను స్థాపించిన కృష్ణంరాజు.. ఆ సంస్థలో వచ్చిన తొలిచిత్రం కృష్ణవేణితో మళ్లీ హీరోగా చేశారు. వాణిశ్రీ కథానాయికగా చేసిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కృష్ణవేణి.. కృష్ణంరాజుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. లేడీ ఓరియంటెడ్ చిత్రం ఆడదని సినిమా నిర్మాణం ముందు ఎంతో మంది చెప్పినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేసి విజయాన్ని అందుకున్నారు కృష్ణంరాజు. మధుసూదనారావు దర్శకత్వంలో చేసిన ఆ సినిమాలో సి. నారాయణరెడ్డి రాసిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 12 కేంద్రాల్లో కృష్ణవేణి శతదినోత్సవం జరుపుకుంది
‘కృష్ణవేణి’ సాధించిన విజయంతో ఆయన నిర్మాతగా మరో ముందడుగు వేశారు. భక్తిరస చిత్రాలను తీయాలనే ఉద్దేశంతో ‘భక్తకన్నప్ప’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. గొప్ప శివభక్తుడిగా ‘తిన్నడు’ పాత్రలో ఆయన నటన నభూతో అనిపిస్తుంది. ముఖ్యంగా శివునికి మాంసాహార భోజనం పెట్టి ఆరగించమని చెప్పే సన్నివేశంలో ఆయన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత శివలింగంలోని ఒక కంటి వెంట నీరు వస్తుంటే చలించిన తిన్నడు లింగానికి తన కన్నును అమర్చుతాడు. అప్పుడు శివలింగంలోని మరో కంటి నుంచి నీరు కారుతుంది.
అప్పుడు తిన్నడు తనకున్న మరో కంటిని లింగానికి అమర్చేందుకు పూనుకుంటాడు. కన్ను పెకిలించే ముందే శివలింగానికి కంటిని పెట్టే చోటును కాలి బోటన వేలితో గుర్తు పెట్టుకుని రెండో కంటిని అమర్చేసన్నివేశంలో కృష్ణంరాజు జీవించారు. ‘భక్తకన్నప్ప’ సినిమాలో వేటూరి రాసిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ‘భక్తకన్నప్ప’ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో 25వారాలు ఆడి ఆయన నట జీవితంలో ఓ కలికితురాయిగా నిలిచిపోయింది.
‘భక్తకన్నప్ప’ చిత్రం తర్వాత సొంత నిర్మాణ సంస్థలో గ్యాప్ తీసుకుని బయటి చిత్రాల్లో నటించారు కృష్ణంరాజు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం’ అనే చిత్రం ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో నిర్మించిన మూడో చిత్రం నిరాశ పరచగా నాలుగో చిత్రమైన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సంచలన విజయం సాధించింది.
ఇందులో కృష్ణంరాజు ద్విపాత్రాభినయంతో తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’గా, బ్రహ్మన్న కుమారుడు ‘గోపి’గా కృష్ణంరాజు నటించి ప్రేక్షకులను మెప్పించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాను కృష్ణంరాజు నిర్మించారు. ఇందులో ఆయన తాండ్రపాపారాయుడు పాత్రను పోషించారు. ఆ చిత్రం హిట్ కానప్పటికీ ఆ పాత్రకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు.
‘విశ్వనాథ నాయకుడు’ చిత్రంలో ‘శ్రీ కృష్ణదేవరాయలు’గా నటించారు. ఆయన ఆద్యంతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించిన తొలిచిత్రం ‘మా నాన్నకు పెళ్లి’. ఈ సినిమాలో శ్రీకాంత్ తండ్రి పాత్రతో తనదైన ముద్రవేశారు. వ్యాపారవేత్తగా, తల్లిలేని కొడుకును అపురూపంగా పెంచుకునే తండ్రిగా అద్భుతంగా నటించారు.
బాలకృష్ణ హీరోగా నటించిన ‘సుల్తాన్’, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బిల్లా’ చిత్రంలో పోలీసు ఉన్నతాధికారిగా నటించారు.’రుద్రమదేవి’ చిత్రంలో కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా రుద్రమదేవికి తండ్రిగా, ఆమెను పోరాట పటిమ కలిగిన నాయకురాలిగా తీర్చిదిద్దే పాత్రలో ఒదిగిపోయారు. అలా విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు.