శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `గమనం`. ఈ చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భారతీయ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కురిసిన వానలు.. హైదరాబాద్ వరదలు ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చినట్టున్నాయి. సుజనా రావు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని క్రిష్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ని ఐదు భాషల్లోనూ ప్రముఖ హీరోలు విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ `వకీల్‌సాబ్` లొకేషన్‌లో రిలీజ్ చేశారు. మూడు కథల సమాహారంగా ఈ మూవీ సాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వేదం కూడా ఇదే తరహాలో సాగింది. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ఓ జంటగా కనిపించారు. స్లమ్ ఏరియాలో వుండే గృహిణిగా శ్రియ కనిపించింది. చెవిటి యువతి పాత్ర తనది. భర్త వదిలేయడంతో ఇద్దరు పిల్లలతో అవస్థలు పడే గృహిణిగా శ్రియ పాత్ర ఆకట్టుకుంటోంది.
క్రికెటర్ కావాలన్నది శివ కందుకూరి లక్ష్యం.. ఓంకార్ డ్రామ జూనియర్స్ లో ఆకట్టుకున్న ఇద్దరు పిల్లల్ని మరో పెయిర్‌గా ఇందులో చూపించారు. అనాధలైన ఈ పిల్లలకు పుట్టిన రోజు చేసుకోవాలన్నది కల. .. ఇలా ఈ ముగ్గురు జంటల నేపథ్యంలో కథ గమనం ఆసక్తికరంగా చాలా వరకు తెలంగాణ మాండలికంలోనే సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇలా భిన్న దృవాలు.. భిన్నమైన ఆలోచనలు గల ఈ మూడు జంటల జీవితాల్లో హైదరాబాద్ వరదలు చేసిన అలజడి ఏంటి? వారిని ఏ తీరాలకు చేర్చింది? అన్నదే ఇందులో ఆసక్తికరం. అతిథి పాత్రలో నిత్యామీనన్ మెరిసింది. ఇళయరాజా సంగీతం, జ్ఞానశేఖర్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటోంది. వరదల్ని చూపించిన తీరు మరింత రియలిస్టిక్‌గా వుంది. ఈ సినిమా శ్రియకు అవార్డుని తెచ్చిపెట్టేలా వుంది.