సూర్య @48ఇయర్స్​.. ఈ విషయాలు మీకు తెలుసా?

-

ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. కెరీర్ మొదటినుంచి అటు కమర్షియల్ ఇటు ప్రయోగాత్మక చిత్రాలతో భిన్నమైన పాత్రలు చేస్తూ మాస్, క్లాస్​ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారాయన. ‘శివపుత్రుడి’లో మిత్రుడిగా.. ‘గజిని’లో గతం మర్చిపోయే వ్యక్తిగా.. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’​తో తండ్రి కొడుకులుగా.. ‘సింగం’తో యూనిఫామ్​లో ఉన్న సింహంలా.. ‘సెవెన్త్ సెన్స్​’లో మనకు తెలియని చారిత్రక హీరోగా.. ’24’ సినిమాతో కాలాన్ని తారుమారు చేసే మాయగాడిలా.. ‘ఆకాశమే హద్దురా’తో లక్ష్యం కోసం శ్రమించే ఓ యోధుడిలా.. ‘జైభీమ్’​తో న్యాయం కోసం పోరాడే న్యాయవాదిలా.. ఇలా అన్నిరకాల వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు ఆయన పోషించిన పాత్రలను నెమరువేసుకుందాం…

సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళంలో నటుడిగా గుర్తింపు పొందిన శివకుమార్ పెద్ద కుమారుడు. చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును సూర్యగా మార్చుకున్నారు. ఈ పేరును దర్శక దిగ్గజం మణిరత్నం సిఫార్సు చేశారు. అప్పటికే తమిళంలో శరవణన్ అనే నటుడు ఉండటంతో ఈ పేరును సూచించారాయన. ఆయన తన సొంత పేరుతోనే కొన్ని సినిమాల్లో నటించారు. నినైథూ, వరణం ఆయిరం, రక్త చరిత్ర-2 చిత్రాల్లో ఆయన పాత్ర పేరు సూర్యనే.

సినిమాల్లోకి రాకముందు సూర్య ఓ వస్త్రాల ఎగుమతి కర్మాగారంలో కొన్ని నెలల పాటు పనిచేశారు. తమిళ నటుడు శివకుమార్ కుమారుడిగా కాకుండా.. తనకంటూ ఓ గుర్తింపు రావాలని సూర్య భావించారు. ఆ సమయంలో అతడు తన ఐడెండిటీని బయటకు చెప్పకుండా సామాన్యుడిగా పనిచేశారు. సూర్య 1997లో తొలిసారిగా ‘నెరుక్కు నేర్’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. అయితే అంతకంటే ముందు ఆయన.. ప్రముఖ దర్శకుడు వసంత్ తెరకెక్కించిన ఆశాయ్​తో(1995) సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటికీ సూర్య యాక్టింగ్​పై ఆసక్తి లేకపోవడం వల్ల అజిత్​ ఆ చిత్రంలో నటించి సూపర్​హిట్​ను అందుకున్నారు.

నటనతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య ఇప్పటికే ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 5 రాష్ట్ర పురస్కారాలు అందుకున్నాడు. 5 సైమా అవార్డులు, 4 ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు కైవసం చేసుకున్నాడు సూర్య. తాజాగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. వీటిల్లో అత్యధికంగా 5 అవార్డులను ‘సూరారై పోట్రు’ చిత్రం గెలుచుకుంది. సూర్య ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకున్నారు.

‘అగరమ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ఆ సామాజిక సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సూర్య. చదువుకోలేని పేద పిల్లలకు ఈ సంస్థ ద్వారా ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. తండ్రి శివకుమార్ పేరు మీద ‘శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి శ్రీలంకలోని తమిళులకు సాయం చేస్తున్నారు. అంతేకాకుండా పలు సామాజిక ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.

ఓ పక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క నిర్మాత అవతారమెత్తారు సూర్య. 2డీ ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​లో జ్యోతిక ప్రధాన పాత్రలో ’36 వయదినిలే’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. పసంగ2 (మేము), 24, మాగలీర్ మట్టుమ్, కడై కుట్టి సింగమ్, ఇంకా పలు చిత్రాలను నిర్మించారాయన.

సూర్య కెరీర్​లో ఈ పాత్రలు వేరీ స్పెషల్​

  • గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని కాకా కాకా (తెలుగులో ఘర్షణ) చిత్రంతో సూర్య స్టార్ హీరో అయ్యారు. అనంతరం శివపుత్రుడు, సుందరాంగుడులో విభిన్న పాత్రలతో మెప్పించారు.
  • ‘సుందరాంగుడు’లో గూని ఉన్న వ్యక్తి పాత్రలో నట విశ్వరూపం చూపించారు. తర్వాత ‘గజిని’లో ఆ యాక్టింగ్ శిఖరాన్ని తాకింది. 15 నిమిషాల్లో అన్నీ మర్చిపోయే మానసిక రోగిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో తెలుగులోనూ స్టార్​ అయ్యారు సూర్య.
  • గౌతమ్​ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రెండు పాత్రల్లో నటించి ఉత్తమనటుడిగా ఫిల్మ్​ఫేర్ అందుకున్నారు
  • ‘సెవెన్త్​ సెన్స్’​లో బౌద్ధ గురువుగా కనిపించి.. చారిత్ర హీరోగా మార్కులు కొట్టేశారు.
  • ‘బ్రదర్స్’​లో కవలలుగా మాస్​, క్లాస్​ పాత్రలతో కనిపించి తన నటనతో ఫిదా చేసేశారు.
  • ’24’లో ఏకంగా హీరో, విలన్​ పాత్ర తానే పోషించి తనలోని కొత్త కోణాన్ని చూపించారు.

ఇక తాజాగా వచ్చిన ‘విక్రమ్​’లో చివరి మూడు నిమిషాల్లో క్రూరమైన విలన్​గా కనిపించి సినిమాకే హైలైట్​గా నిలిచారు. ప్రస్తుతం ఆయన దాదాపు 18ఏళ్ల తర్వాత మళ్లీ బాల దర్శకత్వంలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news