రేపటి నుంచి థియేటర్లు బంద్ ‌

-

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. ఇప్పటికే గతేడాది లాక్ డౌన్ సమయంలో దాదాపు ఆరు నెలలకు పైగా థియేటర్లు మూతపడి ఉండడంతో యజమానులు నష్టాలు చవిచూశారు. తాజాగా రేపటి నుంచి తెలంగాణలో థియేటర్లు మూసివేయనున్నారు. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బుధవారం నుంచి థియేటర్లను మూసివేయాలని ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే థియేటర్స్ తప్ప అన్ని థియేటర్స్ బంద్ కానున్నాయని సమాచారం. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే తప్ప సినిమా షూటింగ్‌లు చేయకూడదని నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ కేవలం 50 మందితోనే సినిమాల షూటింగ్ జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. అటు సినీ పరిశ్రమ మనుగడ, ఇటు కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ వెల్లడించారు.

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. మే ఒకటో తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. వివిధ వ్యాపార దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్స్, కార్యాలయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news