కాంగ్రెస్ – బీజేపీల ఉమ్మడి శత్రువు ఈ అమ్మడు… కారణం?

ఈ మధ్య వరుస వివాదాల్లో నిలుస్తోంది నటి వనిత విజయ్ కుమార్. తాజాగా మూడో పెళ్లి చేసుకున్న ఈ భామ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. సరికొత్తగా ఆమె రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురయ్యారు. అదేమంటే… ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనిత పెళ్లిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారిపై ఎదురు దాడి చేసే పనిలో భాగంగా ఆమె తంజావూర్‌ ప్రజలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వనిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే నటీమణి వనిత చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాంత కాంగ్రెస్, బీజేపీ వర్గాలను ఆగ్రహం తెప్పించాయి. ఈ వ్యవహారంపై తంజావూర్‌ జిల్లా, పుదుక్కొటై నగర పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా కాంగ్రెస్‌ యువజన పార్టీ కార్యదర్శి శివ ఫిర్యాదు చేశారు. తంజావూరు మట్టికి, ప్రజలకు గొప్ప చరిత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి ప్రజలను వారి మనోభావాలను కించపరిచే విధంగా వనిత వ్యాఖ్యలు చేశారని ఆయన విరుచుకు పడ్డారు. తంజావూరు ప్రజలందరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వనితపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండా ఆమెపై బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు తంజావూర్‌ కలెక్టర్‌ గోవిందరావు, ఎస్పీ దేశ్ముఖ్‌ శేఖర్‌ సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. నిజంగా వనిత వ్యాఖ్యలు తంజావూరు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వెంటనే తంజావూర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వనితపై చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ నేతలు చెరో పక్క కేసులు పెట్టడంతో వనిత ఎట్టకేలకు తగ్గింది.

తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని వేడుకున్నారు. అంతేకాకుండా తమ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే మంచి మనసుతో క్షమించాలని తెలిపారు. మొత్తానికి ప్రజలతో పెట్టుకుంటే ఎంతటివారైనా దిగి రావాల్సిందే మరి!