పుతిన్ కు తీవ్ర అస్వస్థత.. రష్యాలో టెన్షన్ టెన్షన్..!

రష్యాలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి కారణం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడమే. పుతిన్‌ ఆరోగ్య విషయంపై గత కొంతకాలంగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గతవారం కూడా ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యం బారినపడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పుతిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. పారామెడికల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు సమాచారం.
‘జులై 22 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర వికారంగా ఉన్నట్లు పుతిన్‌ తన సహాయకులకు చెప్పారు. విధుల్లో ఉన్న పారామెడికల్‌ సిబ్బంది ఓ ఇరవై నిమిషాల పాటు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. తర్వాత పరిస్థితి కుదుటపడకపోవడంతో వెంటనే ప్రత్యేక వైద్య బృందానికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పుతిన్‌ ఛాంబర్‌కు చేరుకున్న వైద్య బృందం.. మూడు గంటలపాటు చికిత్స అందించింది. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో తెల్లవారుజామున పుతిన్‌ ఛాంబర్‌ నుంచి వైద్యులు బయటకు వెళ్లిపోయారు’ అని రష్యాకు చెందిన ఓ వార్తా ఛానెల్‌ వెల్లడించింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్యంపై వస్తోన్న కథనాలు మరింత ఎక్కువైన సంగతి తెలిసిందే. ఆయన క్యాన్సర్‌ లేదా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్నారనే వార్తలూ వచ్చాయి. అంతకుముందు పలు సమావేశాల్లోనూ ఆయన చేతులు, కాళ్లు వణుకుతున్నట్లు కనిపించాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే, అటువంటి వార్తలను రష్యా అధ్యక్ష భవనం తోసిపుచ్చింది. అవన్నీ ఫేక్‌ వార్తలేనన్న క్రెమ్లిన్‌.. పుతిన్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారనే వార్తలు వెలువడ్డాయి.