భక్తి: అక్షయ తృతీయ నాడు ఇవి మరచిపోవద్దు…!

అక్షయ తృతీయని ఎంతో వైభవంగా ఇళ్ళల్లో, దేవాలయంలో నిర్వహిస్తారు. సింహాచలం లో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది. సాధారణంగా ఏడాది మొత్తం కూడా చందనపు పూత తో స్వామి కప్పి ఉంటారు. కానీ అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనం ఉంటుంది. అలానే చార్ ధామ్ యాత్ర లో ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయాన్ని చలి కాలం తర్వాత తిరిగి తెరిచేది కూడా అక్షయ తృతీయ నాడు.

అదే విధంగా పూరీ లో జగన్నాథుని రథ నిర్మాణాన్ని కూడా ఆ రోజునే అంకురార్పణ చేస్తారు. అయితే అక్షయ తృతీయ నాడు పూజ ఎలా చేయాలి అనేది ఈ రోజు మనం చూద్దాం…! సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి లక్ష్మీ దేవిని కుబేరుడికి కుడి పక్కన పెట్టి పూజించాలి.

అదే విధంగా వెండి దీపాలు కానీ లోహ దీపావళి కానీ లేదా మట్టి దీపాలు లో కానీ ఒత్తు వేసి ఆవు నేతి తో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. సాధారణ పూజా విధానంతో పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోతరం చదువుకుంటే మంచిది. పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలు తలమీద వేసుకుని.. శక్తి మీద దాన ధర్మాలు చేస్తే మంచిదని పండితులు అంటున్నారు.

చాలామంది ఈ రోజున వైశాఖ పూజ కూడా చేస్తారు. ఉష్ణ తాపం నుండి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడిపళ్ళు, వస్త్రాలు, గంధం దానం చేస్తూ ఉంటారు. అయితే ఎవరికైనా ఎండలు మండిపోతున్న ఈ నెల లో ఇలా ఈ పుణ్య దానం చేస్తే మంచి ఫలితం కనబడుతుందని అక్షయం అవుతుందని అంటారు.

పితృదేవతలకు ఈ రోజున తర్పణాలు వదిలితే పుణ్యలోక ప్రాప్తి ఇస్తుందని అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ పూజలు చేయొచ్చు. కొందరు అయితే బంగారం కొన్ని లక్ష్మీ దేవికి అలంకరించి పూజ చేస్తారు. ఈరోజు యజ్ఞం, యాగం, పూజలు, జపాలు ఏమి చేసినా అక్షయమైన ఫలితాలు ఇస్తాయి.