విష్ణుమూర్తి సంపూర్ణావతార ఆవిర్భావం- కృష్ణాష్టమీ!!

-

తొలి ఏకాదశితో హిందు పండుగల పరంపర ప్రారంభమైంది. శ్రావణమాసంలో మొట్టమొదట వచ్చే పండుగ శ్రావణ శుక్రవారం (రెండో) వరలక్ష్మీ వ్రతం. తర్వాత ప్రధానంగా దేశమంతా చేసుకునే పండుగ కృష్ణాష్టమి. అసలుకృష్ణాష్టమి అంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణ+ అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి.శాక్తేయ సిద్ధాంతంలో శ్రావణ కృష్ణపక్ష అష్టమి నాటి రాత్రికి మోహ రాత్రి అని పేరు. కృష్ణజన్మకు పూర్వమే గల ఈ రాత్రి ఉపాసకులకు ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే, నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహాశక్తి యోగమాయ జన్మించింది.

Importants Of Sri Krishna Janmashtami
Importants Of Sri Krishna Janmashtami

ఆ తల్లి పుట్టినది కూడా అష్టమి రోజే కావడం మరో విశేషం. హబాల్యంలోనే దావాగ్నిని మింగి గోకులాన్ని కాపాడిన స్వామి ఆయన. బ్రహ్మదేవుడి అహం అణచివేస్తూ ఏకకాలంలో అనేకంగా గోవులను, గోప బాలుర రూపాల్ని ధరించి అబ్బురపరచాడు. మట్టుపెట్టడానికి మాయారూపాలతో వచ్చిన రాక్షసులని చడీచప్పుడు లేకుండా రూపుమాపిన బాల కృష్ణుడు. చిటకనవేలితో గోవర్ధనగిరిని ఎత్తినవాడు. స్వర్గలోకంలోని ఇంద్రుడి గర్వాన్ని అణిచివేశాడు. శుద్ధజలాల్ని విషమయం చేసిన కాళీయ సర్పాన్ని నియంత్రించాడు. ఫణి ఫణాలపై నర్తించి, అతడిని ఆ నీటి నెలవు నుంచి మళ్లించి, సురక్షిత స్థలానికి పంపి అనుగ్రహించాడు.

కృష్ణావతారంలో ప్రధానంగా కువలయాపీడం అనే మదగజాన్ని నిరోధిండం, చాణూర ముష్టికాది మల్లయోధుల్ని ఓడించాడు. కంస శిశుపాలాది దుష్టుల్ని దునుమాడిన ప్రతాపశాలి. జరాసంధ, రుక్మి, కాలయవనుడు వంటి దుర్మార్గుల దురాగతాల్ని అడ్డుకున్నాడు. ఆయన రాజనీతి చతురుడు. ద్రౌపదీదేవిని నిండుసభలో పరాభవించిన కౌరవుల్ని హెచ్చరించాడు. అనివార్యమైన సంగ్రామంలో వారికి తగిన పాఠం చెప్పిన ధర్మరక్షకుడు కృష్ణుడు.

ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు

కృష్ణభగవానుడు ఆర్తితో శరణు వేడిన ద్రౌపదిని ఆదుకున్నాడు. ధర్మానికి కట్టుబడి తనను ఆశ్రయించిన పాండవుల్ని అక్కునజేర్చుకున్నాడు. జ్ఞానభక్తుడై చేరుకున్న కుచేలుణ్ని ఆదరించిన ప్రేమమూర్తి కృష్ణుడు. జరాసంధుడి చెరలో గల ఎనభై మంది రాజుల్ని విడిపించి, సుస్థిరత కలిగించిన దయాళువు. నరకాసురుడి బారిన పడిన పదహారువేల మంది రాచకన్యలకు, వారి కోరిక మేరకు భద్రత చేకూర్చిన లోకరక్షకుడు. తన వైపు గల సైన్యం కంటే తానే చాలని ఎంచుకున్న అర్జునుడి రథానికి సారథిగా విజయాన్ని ప్రసాదించాడు. కృష్ణుడు విశ్వజనీన తత్వశాస్త్రమైన గీతామృతాన్ని వర్షించిన జ్ఞానానంద మూర్తి. తన, పర అనే భేదం లేకుండా, వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలాల్ని ప్రసాదించాడు. వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వమార్గాల్ని కృష్ణుడు చక్కగా సమన్వయించాడు. సర్వశాస్త్రసారంగా అర్జునుడికి గీతాశాస్ర్తాన్ని బోధించడమే కాక, తన అవతార పరిసమాప్తి వేళ ఉద్ధవుడికి తత్వబోధ చేసిన జగద్గురువు ఆయన.

కృష్ణం వందే జగద్గురుం

అవతార కాలంలోనే కాక ఆ తరవాతి కాలంలోనూ తనను స్మరించి, ఆరాధించి, కీర్తించిన యోగుల్ని తరింపజేసిన భగవానుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు… ఇలా ఎందరెందరో కృష్ణయోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తిమార్గంలో జ్యోతి స్వరూపులై వెలుగునింపారు. అందరివాడిగా అల్లరి కృష్ణుడిగా రాధాకృష్ణుడిగా రకరకాల రూపాలతో రకరకాల తత్వాలతో అందరినీ అనుగ్రహించిన జగత్ గురువు శ్రీకృష్ణ పరమాత్మ

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news