మాఘ పౌర్ణిమ ప్రత్యేకం.. మహామాఘి స్నానం పాపక్షయకారిణి!

-

Magha Purnima special bath

సనాతన ధర్మంలో పన్నెండు మాసాలు దేనికవే ప్రత్యేకం. అందులో మరీ విశేషమైనవిగా చెప్పేవి… ‘ఆ, కా, మా, వై’ అంటే.. ఆషాఢం, కార్తీకం, మాఘమాసం, వైశాఖమాసం. వీటిలో ఆషాఢం చాతుర్మాస్య దీక్ష, తొలి ఏకాదశి వంటి విశేషాలు ఉండగా, కార్తీకం గురించి చెప్పనక్కర్లేదు, ఇక తర్వాత వచ్చినదే మాఘమాసం. ఒక్కో మాసం ఈశ్వరునికో, విష్ణువుకో ప్రీతికరం అయితే మాఘమాసం త్రిమూర్తులకు ప్రత్యేకం, ప్రీతికరం. ఈ మాసంలో బ్రహ్మపత్ని అయిన చదువుల తల్లి సరస్వతి జన్మదినం వసంత పంచమి, విష్ణు స్వరూపమైన సూర్యనారాయణనుని రథసప్తమి, పరమశివుని లింగోద్భవం మూడు వస్తాయి. ఇక ప్రతినెలలో పౌర్ణమి ప్రత్యేకం కాగా మాఘపౌర్ణమి మరీ ప్రత్యేకమైనది. ఈరోజు సముద్ర స్నానానికి విశేషం. ఈరోజు అంటే ఫిబ్రవరి 19 మంగళవారం సముద్ర స్నానం ఆచరించి దానాలు, ధర్మాలు చేస్తే చాలు సర్వపాపాలు పోయి పాపరాహిత్యం వస్తుందని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సముద్రస్నానం వీలుకానివారు ఈసారి జరుగుతున్న కుంభమేళ స్నానం చేసినా చాలా విశేషం. లేదంటే సంగమస్నానం లేదా దగ్గర్లోని ఏదైనా నదీస్నానం అదీ కుదరకపోతే తటాక లేదా బావి లేదా బోరు వేసుకొని నీరు పట్టుకొని స్నానం చేయండి.

ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి?

మాఘ పౌర్ణిమ రోజు తెల్లవారు జామున అంటే 4 నుంచి 6 లోపు చేస్తే విశేషం. 6-7 సాధారణం. ఆ తర్వాత ఆచరిస్తే పెద్దగా ఫలితం ఉండదు.

-ఎలా చేయాలంటే సముద్రం/నదులు లేదా ఇంట్లో అయితే భగవన్నామస్మరణ, పవిత్ర నదీ నామస్మరణ ‘గంగ, యమున, నర్మదా, గోదావరి, కబుష్ణా, సింధు, కావేరీ ఇలా జీవనదులను స్మరిస్తూ చేయాలి. లేదా హరేరామ… లేదా గోవింద లేదా శివ, శివ అంటూ చేయాలి. స్నానం అనంతరం 12 సార్లు సూర్యనామాలు పఠిస్తూ దోసిట్లో నీరును తీసుకుని తూర్పు వైపు ఆర్ఘ్యం ఇవ్వాలి. 12 నామాలు రానివారు ఓం మిత్రాయనమ: లేదా ఓం రవయేనమ: లేదా ఓం రవయేనమ: లేదా ఓం భాస్కరాయనమ: లేదా ఓం ఆదిత్యాయనమ: నామాల్లో ఏదో ఒకదాన్ని 12 సార్లు అంటూ ఆర్ఘ్యం ఇవ్వండి. సమస్త ప్రాణకోటికి జీవనాడి అయిన సూర్యనారాయణుడి ఆరాధన ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది.

-తర్వాత ఇంట్లో/దేవాలయంలో దేవతారాధన, తర్వాత అవకాశాన్ని, శక్తిని బట్టి దానం, ధర్మం చేయండి.

-12 మాసాల్లో మాఘమాసంలో సముద్రస్నానం వీలు కాకుంటే ఇంట్లోనే భగవన్నామస్మరణ చేసుకుంటూ స్నానం చేస్తే సూక్ష్మ, స్థూల పాపాలు పోతాయి. మాఘస్నానం గురించి బ్రహ్మాండ పురాణంలో విశేషంగా చెప్పబడింది.

అందరూ భక్తితో ఆచరించండి. తప్పక మంచి జరుగుతుంది. నమ్మకం, విశ్వాసంతో చేయండి విశేష ఫలితాలు అనతికాలంలోనే లభిస్తాయి. ఓం నమో నారాయణాయనమ:

కేశవ

Read more RELATED
Recommended to you

Latest news