కృష్ణుడికి మొదటి లవ్ లెటర్ రాసింది ఎవరో తెలుసా..?

-

ఎదలో బృందావనం.. మాటే మురళీరవం.. అడుగే ఓ ఆలయం.. ఆయనే కృష్ణభగవానుడు. ప్రేమంటే కృష్ణుడు.. కృష్ణుడు అంటే ప్రేమ. ప్రేమకు నిలువెత్తు రూపం కన్నయ్య. ఆట, అల్లరి, స్నేహం, ప్రేమ, నాయకత్వం, బంధం ఇలా అన్నింట్లోనూ కిట్టయ్యే నంబర్ వన్. వేలమంది గోపికలు, 8 మంది భార్యలు, విశ్వంలో ఉన్న ప్రతి యువతి మది దోచిన కృష్ణుడి మనస్సును మొదటో దోచింది ఎవరు. తన చిలిపి చేష్టలతో అమ్మాయిల గుండెల్లో ప్రేమ బాణం గుచ్చే కన్నయ్యకు మొదటి ప్రేమలేఖ ఎవరు రాశారు? ఆ లేఖ చదివిన తర్వాత మన కిట్టయ్య రియాక్షన్ ఏంటి..?

అమ్మాయిల మనసుని కొల్లగొట్టిన కృష్ణుడి ప్రేమలో రుక్మిణీ కూడా పడిపోయింది. అయితే అందరిలా కృష్ణుడిని చూసి కన్నయ్య చిలిపి చేష్టలకు ఫిదా కాలేదు. కృష్ణుడి గురించి వింటూ వింటూ ప్రేమలో పడిపోయింది రుక్మిణి. విదర్భ రాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి అందంలోనూ, గుణంలోనూ తనకు తానే సాటి. ఆమె అనుకూల ప్రవర్తన వల్లే కృష్ణుడికి తన అష్టభార్యల్లో రుక్మిణి చాలా ప్రత్యేకం. అయితే తన మనసులో మాటను తండ్రికి తెలియజేసింది రుక్మిణి. తండ్రి అంగీకరించినా ఆమె సోదరుడైన రుక్మికి ఇష్టంలేదు. ఎందుకంటే తన సోదరిని శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని అప్పటికే ప్రకటించాడు రుక్మి. సోదరుడి పట్టుదల చూసిన రుక్మిణికి ఏం చేయాల అర్థంకాలేదు. శిశిపాలుడితో పెళ్లి ఇష్టంలేదు..శ్రీకృష్ణుడిని మనసులోంచి చెరిపేసుకోలేదు. అందుకే పెళ్లికి ముందు రోజు శ్రీకృష్ణుడికి లేఖ రాసిన రుక్మిణి తన అంతరంగాన్ని తెలియజేసింది.

ఇంతకీ ఆ ప్రేమ లేఖలో ఏం ఉందంటే.. “ఓ కృష్ణా మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దు:ఖం నశించి, మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. నా మనసులో నిరంతరం మీ ధ్యాసే, అందం, జ్ఞానం, యవ్వనం సంపదలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్తవయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్ఠమైన, మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి”. రుక్మిణి రాసిన లేఖ చూసిన కృష్ణుడు..ఆమె గురించి తెలుసుకుని తన పరివారంతో కలసి విదర్భకు చేరుకున్నాడు. రుక్మిని ఓడించి శిరోముండనం చేసి..రుక్మిణిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకుపోయి  వివాహం చేసుకున్నాడు.

తాను వలచిన కృష్ణుడి కోసం రుక్మిణి పడినా ఆరాటాన్ని పోతన భాగవతంలో ప్రాణేశ నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల అని ఓపద్యం రాశాడు. ఆ పద్యం భావం ఏంటంటే.. కృష్ణా నీ మాటల మాధుర్యాన్ని వినలేని చెవులు ఎందుకు? నీ ప్రేమలో తడిసిపోని ఈ అందమెందు? కన్నయ్యా.. నిన్ను చూడలేని నా కళ్లకు చూపెందు? నీ అధరామృతం నోచుకోని నాలుకకు రుచెందుకు? పద్మాక్షా.. నీ మెడలోని పూలహారం వాసన చూడలేని నాకు ముక్కు ఎందుకు? కృష్ణా.. ఎన్నిజన్మలకైనా నీకు సేవచేసుకోలేని నాకు ఈ జన్మ ఎందుకు దండగ అని రుక్మణి ఆరాటాన్ని, మనోవేదనను పోతన ఎంతో చక్కగా ఆవిష్కరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news