సికింద్రాబాద్‌లో సూర్యదేవాలయం ఎక్కడ ఉందో తెలుసా!!

-

కన్పించే ప్రతక్ష్య దైవంగా పేరుగాంచిన సూర్యుడిని సనాతన ధర్మంలో అన్ని శాఖల వారు ఆరాధిస్తారు. సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ, ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ, తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు. కానీ ఆ సూర్యనారాయణునికి ఆలయాలు మాత్రం అతి తక్కువ వున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో ఉన్న సూర్యదేవాలయాలలో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వున్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం. అలాగే సికింద్రాబాదులో తిరుమల గిరిలో నిర్మించిన శ్రీ సూర్య భగవాన్ దేవాలయం కూడా రోజురోజుకు ప్రసిద్ధిగాంచుతున్నది. శ్రీ సూర్యశరణ్ దాస్ మహరాజ్ సూర్య భగవానుని భక్తులు. శ్రీ సూర్య భగవానుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్ దాస్ 1959లో ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్య దేవుని ప్రతిష్టించి పూజించసాగారు. శ్రీ సూర్య శరణ్ దాస్ దేవాలయ నిర్మాణాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు. చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మింపబడింది ఈ ఆలయం.

Sri Surya Bhagavan Temple Trimulgherry
Sri Surya Bhagavan Temple Trimulgherry

గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతిమీద మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్కరించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతినానుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు. పక్కనే అశ్వధ్ధ, వేప చెట్లు కలిసివున్న వేదిక. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి, ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజాల పక్కనే ఆరుబయటే అత్యంత సుందరంగా వెలసిన శివ లింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగ దేవత, మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్పామి ఉపాలయాలున్నాయి. నాగ దేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలున్నాయి. ఆదివారాలు, సెలవు రోజులు, పర్వ దినాలలో భక్త జన సందోహం ఎక్కువగా వుంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామికి వచ్చిన భక్తులలో చాలామంది వేయించిన శనగలు, గోధుమలు స్వామికి సమర్పిస్తున్నారు.

ప్రధాన పండుగలు
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి, రథసప్తమికి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడ భక్తులు మొక్కుకుని తమ కోరికలు తీరుతే 12 ఆదివారాలు 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు.

దేవాలయ దర్శన సమయాలు:
సోమవారం నుంచి శనివారందాగా ఉదయం 7 గం. లనుంచీ 11 గం. లదాకా, సాయంత్రం 5 గం. నుంచీ 7 గం.లదాకా.
ఆదివారం 6-30 నుంచి 12-30 దాకా, సాయంత్రం 5 గం. ల నుంచీ 7-30 దాకా దేవాలయం తెరచి ఉంటుంది.

ఎలా వెళ్లాలి?
సికింద్రాబాదు డైమండ్ పాయింట్ నుంచి తిరుమలగిరి వెళ్ళే దారిలో, బోయినపల్లి మార్కెట్ యార్డ్ ముందు నుంచి వెళ్తుంటే ఎడమపక్క ఫుడ్ వరల్డ్ వస్తుంది. అది దాటగానే, దానిని ఆనుకుని వున్న సందులో లోపలకెళ్తుంటే కుడిచేతి పక్క 6వ సందులోకి తిరిగి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపు ఆలయం కనబడుతుంది. సందు మొదట్లో చిన్న బోర్డు వుంటుంది. పొరబాటున సందు గుర్తుపెట్టుకోలేక ముందుకు వెళ్తే వచ్చేది టి జంక్ష్షన్. అక్కడ వెనక్కితిరిగి, తిరిగి వచ్చేటప్పుడు ఎడమవైపు మొదటి సందు తిరగండి. అక్కడే దేవాలయం ఉంది. సూర్యదేవుడి దర్శనం సర్వరోగ హరణం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news