అర్జునుడికి ప్రతిస్మృతి మహావిద్యను ఎవరు ఉపదేశించారు?

-

భారత యుద్ధం అంటే ఆద్యంతం ఆసక్తి. అందులో కథానాయకుడు అంటే అర్జునుడుగానే చెప్పవచ్చు. అయితే ఆయన అలా కావడానికి పలు కారణాలు ఉన్నాయి. సాక్షాత్తు నర, నారాయణలలో విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు అయితే నార అంశతో జన్మించినది అర్జునుడు. ధర్మసంరక్షణకు ఆయా దివ్యపురుషులు అర్జునుడికి రకరకాల శక్తులను ధారపోశారు. అటువంటి దివ్యశక్తుల్లో ఒకటైన ప్రతిస్మృతి మహావిద్యను ఆయనకు ఉపదేశించింది ఎవరో తెలుసుకుందాం…

దుర్యోధనాదులను యుద్ధంలో ఎదుర్కోవడం కష్టమని తలచి తలచి అలసిన ధర్మరాజును సమీపించాడు వ్యాసుడు. పాండవులు అతని రాకకు ఎంతగానో ఆనందించారు. యథోచితంగా గౌరవించారు. ఇష్టాగోష్ఠి జరిగిన అనంతరం ఆ మహాముని ధర్మజునికి ఈ విధంగా ఉపదేశించాడు. ‘భీష్మ ద్రోణ కృపాచార్యులు, రాధేయుడు అజేయులని నీవు కలవర పడుతున్నావు. అది గ్రహించే నేను నీ దగ్గరకు వచ్చాను. నీకిప్పుడు నేనో మహామంత్ర విద్య అనుగ్రహిస్తాను. దానిని నువ్వు తిరిగి సవ్యసాచికి ఉపదేశించు.

ఆ మంత్ర ప్రభావంతో అర్జునునికి అభీష్ట సిద్ధి కలుగుతుంది’ అని వ్యాసుడు ప్రతిస్మృతి పేరున ప్రసిద్ధమైన ఒకానొక దివ్యమంత్ర విద్యను ధర్మపుత్రునికి కటాక్షించాడు.‘నాయనా! ఈ మంత్రాన్ని నువ్వు అర్జునునికి ఉపదేశిస్తే దీంతో ఆ శూరుని పరాక్రమ ప్రాభవం, తపశ్శక్తి పూర్వం కన్నా వేయింతలు అధికమవుతుంది. అంతేకాదు, ఈ మంత్ర ప్రభావం వల్ల అర్జునుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలయిన దిక్పాలకులనేగాక, ఆ పార్వతీపతిని కూడా సాక్షాత్కరింపజేసుకుని వారి అనుగ్రహం వల్ల దివ్యాస్ర్తాలను ఎన్నటినో సంపాదించి భవిష్యత్తులో పగవారిని అవలీలగా నిర్జిస్తాడు’ అని వ్యాసుడు వెళ్లిపోయాడు.

ఒకానొక రోజున అర్జునుని చేర పిలిచి‘దేవేంద్రనందనా! ధనుర్వేదం భీష్మ ద్రోణ కృప కర్ణాశ్వత్థామల భుజస్కంధాలను ఆశ్రయించి ఉన్నది. అందువల్లనే దుర్యోధనుడు వారిని అనుక్షణం ఆదరిస్తున్నాడు. రణరంగంలో వారిని ఎదుర్కొవడం మనవల్లబ కాదు. అయితే మనం వారినే ముందుగా ఎదుర్కోవాలి. ఇదెలా సాధ్యం అనుకుంటున్న తరుణంలో వ్యాసులవారు నన్ను కరుణించి నాకో మహా మంత్రవిద్య ఉపదేశించారు. దాని పేరు ప్రతిస్మృతి. దానిని నీకు నేను ఉపదేశిస్తాను. నువ్వది స్వీకరించి కవచం, ఖడ్గం, కార్ముకం ధరించి ఉత్తర దిశాభిముఖుడివై ప్రయాణం చెయ్యి.

ఈ మంత్ర ప్రభావంతో యాత్రాకాలంలో ఎంతటి వీరాధివీరులయినా నిన్ను ఎదుర్కొనలేరు. నిన్ను ఓడించలేరు. ధర్మరాజు ప్రతిస్మృతి మంత్ర విద్యను అర్జునునికి ఉపదేశించాడు. అదండి సంగతి వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశిస్తే, అర్జునుడికి ప్రతిస్మృతి మహావిద్యను ధర్మరాజు ఉపదేశించాడు. ఇది మహాభారత యుద్ధంలో విజయంలో కీలక పాత్ర పోషించింది.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news