హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. నిజాం రాజులు మనకు అందించిన అద్భుతమైన వంట బిర్యానీని మనం.. ప్రపంచానికి అందించాం. అందుకే ప్రపంచంలో ఎక్కడికెళ్లినా హైదరాబాద్ బిర్యానీయే ఫేమస్ వంటకం.
బిర్యానీల్లో పలు రకాలు ఉంటాయి. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, చేపల బిర్యానీ, గోంగూర బిర్యానీ.. ఇంకా మనకు తెలియని బిర్యానీలు బోలెడు. అయితే.. మీరు ఇప్పటి వరకు వెజ్, చికెన్, మటన్, రొయ్యలు, చేపల బిర్యానీలను కుంబాలకు కుంబాలు లాగించి ఉంటారు. కానీ.. ఎప్పుడైనా గోంగూర బిర్యానీ తిన్నారా? తినలేదంటే మీ జీవితం వేస్టే. భోజన ప్రియులైతే గోంగూర బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటారు తెలుసా? ఇప్పటి వరకు మీరు ఈ బిర్యానీని తినకపోతే ఇప్పుడైనా దీన్ని ఎలా చేయాలో నేర్చుకొని మీ ఇంట్లో వండుకొని ఏం చక్కా లాగించేయండి ఏమంటారు.
గోంగూర బిర్యానికి కావాల్సిన పదార్థాలు
– బాస్మతి బియ్యం.. ఒకటిన్నర కప్పు
– గోంగూర.. రెండు కప్పులు
– అల్లం వెల్లుల్లి పేస్టు.. ఒక టీస్పూను
– ఉల్లిపాయ.. ఒకటి
– పచ్చిమిర్చి.. ఆరు
– కొత్తిమీర.. కొంచెం
– లవంగాలు.. నాలుగు
– దాల్చిన చెక్క.. చిన్నముక్క
– బిర్యాని ఆకు ఒకటి
– నెయ్యి.. ఒక టేబుల్ స్పూను
– నూనె.. ఒక టేబుల్ స్పూను
– ఉప్పు, డ్రై ఫ్రూట్స్.. తగినంత
గోంగూర బిర్యానీ ఎలా చేయాలంటే… ఓ గిన్నెలో నూనె పోయండి. కోసి పెట్టిన గోంగూరను నూనెలో మెత్తగా ఉడికించండి. అనంతరం దాన్ని మిక్సీలో రుబ్బి పక్కన బెట్టండి. కుక్కర్ లో నెయ్యి పోసి దాంట్లో దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, జీడిపప్పు, లవంగాలు వేయండి. బాగా వేగే దాకా వాటిని వేగించండి. అవి వేగాక చిన్నగా తరిమిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి అవి వేగేదాకా ఆగండి. అనంతరం అల్లం పేస్ట్ వేసి మరికొంత సేపు వేయించండి. కొంచెం ఘుమఘుమల వాసన వచ్చాక దాంట్లో గోంగూర పేస్ట్ వేసి బాగా కలపండి. చివరకు బాస్మతి బియ్యం వేసి దానికి సరిపడే నీళ్లు పోయండి. అంతే.. మూడు విజిళ్లు వచ్చేదాకా ఆగండి. తర్వాత గ్యాస్ ఆపి దాన్ని దించి కుక్కర్ ఓపెన్ చేయండి.. అంతే వేడి వేడి గోంగూర బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే గోంగూర బిర్యానీని లాగిస్తే ఉంటుంది మజా.. ఆహా.. ఆ మజా మరెక్కడ దొరకదుపో..