వివాదంలో మ‌ల్లారెడ్డి.. ? ఇదంతా ఎవ‌రి కుట్ర !

-

అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రజాగ్ర‌హాన్ని చవి చూస్తోంది అనేందుకు తార్కాణంగా అనేక ప‌రిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్ర‌జాగ్ర‌హం కార‌ణంగానే మంత్రులు ఇక‌పై ఘెరావ్ కానున్నారు. వారిపై గ‌తం క‌న్నా ఇప్పుడు రెట్టించిన కోపం జ‌నంలో ఉంది. తెలంగాణ ఉద్య‌మంలో లేని వారంతా ప‌ద‌వులు అందుకుని ఆనందంగా ఉంటున్నార‌న్న వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది. ఆ వాద‌న‌కు బ‌లం చేకూర్చే విధంగా కొంద‌రు మంత్రుల నియామ‌కం కార‌ణంగానే త‌మ జాతికి కానీ త‌మ ప్రాంతానికి కానీ ఒరిగిందేమీ లేద‌ని మ‌రో బ‌లీయ‌మైన వాద‌న వినిపిస్తూ ఉంది. వీటి ప‌ర్య‌వ‌సాన‌మే తెలంగాణ రాష్ట్ర స‌మితి రానున్న కాలంలో ప్రజా తిరుగుబాటు తీవ్ర రీతిలో చూడ‌నుంద‌ని ప‌లువురు అంటున్నారు.

గ‌తం క‌న్నా ఇప్పుడు ప్ర‌జ‌లు బాగా ఎడ్యుకేట్ అయ్యార‌ని, క్యాస్ట్ పేరు చెప్పుకుని నాయ‌కులు జ‌నం మ‌ధ్య తిర‌గ‌లేర‌ని, క‌నీసం సొంత సామాజిక వ‌ర్గం డిమాండ్లు అయినా అసెంబ్లీ లో వినిపించ‌కుండా ప‌ద‌వులు అనుభ‌విస్తాం అంటే కుద‌ర‌ని ప‌ని అని వీళ్లంతా అంటున్నారు.అదే నిన్న‌టి వేళ మంత్రి మ‌ల్లారెడ్డికి ఎదురైన అనుభ‌వానికి ఓ ప్ర‌ధాన కార‌ణం అయి ఉంది.

తెలంగాణ వాకిట మంత్రి మ‌ల్లారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. నిన్న‌టి వేళ ఘ‌ట్ కేస‌ర్ లో జ‌రిగిన రెడ్ల సింహ గ‌ర్జ‌నకు అతిథిగా హాజ‌రై అవ‌మాన భారంతో తిరిగివ‌చ్చారు. రెడ్ల కార్పొరేష‌న్ ఏర్పాటు ధ్యేయంగా ఏర్పాటుచేసిన ఈ  బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు. మైక్ అందుకోగానే మ‌ల్లారెడ్డి త‌న స‌హ‌జ సిద్ధ ధోర‌ణిలో కేసీఆర్ ను కీర్తించ‌డం మొద‌లు పెట్ట‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి.

సభా ప్రాంగ‌ణంలో ఉన్న కొంద‌రు వేదిక‌పైకి చెప్పులు విసిరారు. రాళ్లు విసిరారు. దాంతో ఇక్క‌డ ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. మ‌ల్లారెడ్డి ముప్పును ముందే గ్ర‌హించి ప్ర‌సంగం మ‌ధ్య‌లోనే ఆపేసినా ఆగ్ర‌హ జ్వాల‌లు మాత్రం ఆగ‌లేదు. ఆఖ‌రికి ఆయ‌న కాన్వాయ్ పై కూడా కుర్చీలు విసిరారు. రాళ్లు విసిరారు. చెప్పులు విసిరి త‌మ నిర‌స‌న‌లు తెలియ‌జేశారు.

ఇదంతా కుట్ర అని పాల‌క ప‌క్షం ఆరోపిస్తుంది. విప‌క్షానికి చెందిన కొంద‌రు కావాల‌నే చేసిన ప‌ని ఇది అని, రెడ్ల‌కు కేసీఆర్ ఎంతో మేలు చేశార‌ని, ఇక్క‌డ ఓసీ జాబితాలో ఉన్న‌ప్ప‌టికీ రైతు బంధు, క‌ల్యాణ ల‌క్ష్మి లాంటి ప‌థ‌కాలు వ‌ర్తింప‌జేశార‌ని టీఆర్ఎస్ అంటోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ మ‌ల్లారెడ్డి తీరు కార‌ణంగానే ఇటువంటి ప‌రాభ‌వం ఎదురైంద‌ని, ఇక‌పై తీరు మార్చుకుని సొంత వాళ్ల మేలు కోసం ప‌నిచేయాల‌ని కోరుతున్నారు ఇంకొంద‌రు రెడ్లు.

Read more RELATED
Recommended to you

Latest news